కేసీఆర్ దెబ్బ‌కు ఎంద‌రో నాయ‌కులు విల‌విల‌లాడుతున్నారు. ఇందులో సొంత పార్టీ టీఆర్ఎస్ నేత‌ల‌తోపాటు విప‌క్షాల వాళ్లూ ఉన్నారు. ముందుగా మ‌నం కొంద‌రు గులాబీ నేత‌ల గురించి చెప్పుకోవాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా త‌మ‌కే టికెట్ వ‌స్తుంద‌ని న‌మ్మ‌కం పెట్టుకున్నారు. కేసీఆర్ కూడా ఊరించారు. కానీ.. చివ‌రికి వారి ప‌రిస్థితి రెంటికి చెడిన రేవ‌డిలా త‌యారైంది. గురువారం నాడు అనూహ్యంగా అసెంబ్లీని ర‌ద్దు చేసి, ఏకంగా 105మంది అభ్యర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఇందులో దాదాపుగా అంద‌రూ సిట్టింగులే ఉన్నారు. ఆందోల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూమోహ‌న్‌, చెన్నూరు సిట్టింగ్ న‌ల్లాల ఓదేలుకు టికెట్లు నిరాక‌రించారు. మిగిలిన స్థానాల్లో అభ్య‌ర్థుల పేర్లను పెండింగ్‌లో పెట్టారు. ఇందులో వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పేరును కూడా పెండింగ్‌లో పెట్ట‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. 


ఆ ముగ్గురికి కేసీఆర్ టిక్కెట్ షాక్‌... !

ఇక్క‌డ ప్ర‌ధానంగా న‌ష్ట‌పోయిన నేత‌లు కొంద‌రు ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. 2014 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా మానుకోట నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ నుంచి అప్ప‌టి సిట్టింగ్ ఎమ్మెల్యే మాలోత్ క‌విత బ‌రిలోకి దిగి టీఆర్ఎస్ అభ్య‌ర్థి శంక‌ర్‌నాయ‌క్ చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల్లో ఆమె అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. డోర్న‌క‌ల్ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలిచిన‌ డీఎస్ రెడ్యానాయ‌క్ కూడా టీఆర్ఎస్‌లో చేరారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మానుకోట టికెట్ త‌న కూతురు క‌విత‌కే వ‌స్తుంద‌ని డీఎస్ చెప్పుకుంటూ వ‌చ్చారు. ఈ విష‌యాన్ని బ‌హిరంగంగానే డీఎస్‌తోపాటు ఆయ‌న కూతురు క‌విత కూడా చెప్పుకున్నారు. ఈ క్ర‌మంలో శంక‌ర్‌నాయ‌క్‌తో తీవ్ర‌స్థాయిలో విభేదాలు ఏర్ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో అప్ప‌టి మ‌హిళా క‌లెక్ట‌ర్ తో శంక‌ర్‌నాయ‌క్ అనుచితంగా ప్ర‌వ‌ర్తించ‌డం క‌ల‌క‌లం రేపింది.


ఈ దెబ్బ‌తో ఇక శంక‌ర్‌నాయ‌క్‌కు టికెట్ రాద‌నీ.. క‌విత‌కే టికెట్ ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ.. ఈ ఊహాగానాల‌కు కేసీఆర్ త‌న‌దైన శైలిలో తెర‌దించారు. శంక‌ర్‌నాయ‌క్‌కే టికెట్ ఇచ్చి క‌వితకు షాక్ ఇచ్చారు. నిజానికి ఇప్పుడు ఆమె రాజ‌కీయ జీవితం ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌నే టాక్ వినిపిస్తోంది. ఇక భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గండ్ర స‌త్య‌నారాయ‌ణ టీఆర్ఎస్ అభ్య‌ర్థి, స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారి చేతిలో ఓడిపోయారు. అనంత‌రం ఆయ‌న కూడా టీఆర్ఎస్లో చేరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇస్తాన‌ని కేసీఆర్ హామీ ఇస్తేనే పార్టీలో చేరార‌నే టాక్ ఉంది. ఈ క్ర‌మంలోనే స్పీక‌ర్ కుమారుల తీరుతో ప్ర‌జ‌ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ఈసారి గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌కే టికెట్ వ‌స్తుంద‌ని అనుకున్నారు. ఇక్క‌డ కూడా గండ్ర‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చారు కేసీఆర్‌. 


ఇక స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో రాజార‌పు ప్ర‌తాప్ ప‌రిస్థితి కూడా ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ త‌ర్వాత గులాబీ గూటికి చేరారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర మైనారిటీ క‌మిష‌న్ వైస్ చైర్మ‌న్ నియ‌మించారు కేసీఆర్‌. కానీ.. కొద్దిరోజుల్లోనే.. అది కూడా ఆయ‌న బాధ‌త్య‌లు చేప‌ట్ట‌కుండా.. రాజార‌పు రాజీనామా చేశారు. దీంతో ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌కు టికెట్ రాద‌నీ.. రాజార‌పుకే వ‌స్తుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. నిజానికి.. రాజార‌పు కూడా ఇదే విష‌యాన్ని నియోజ‌క‌వ‌ర్గంలో చెప్పారు. కానీ.. చివ‌ర‌కు గురువారం కేసీఆర్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల జాబితాలో ఆయ‌న పేరు లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ‌య్య‌కే మ‌ళ్లీ అవ‌కాశం ఇచ్చారు. దీంతో రాజార‌పు ప్ర‌తాప్ ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా త‌యారైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: