తెలంగాణా అసెంబ్లీ అర్ధాంతరంగా రద్దు చేయడంతో ఎన్నికలు వీలైనంత తొందరగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ ) భారీ కసరత్తు  చేస్తోంది. ఇందులో భాగంగా పాత షెడ్యూల్ ప్రకారం కటాఫ్ డేట్ ని పెట్టుకుంటున్నారు. దాంతో కొత్త ఓటర్లకు ఈ సారి చాన్స్ మిస్ అయినట్లే. వారు మళ్ళీ అసెంబ్లీకి  ఓటేయాలంటే అయిదేళ్ళ పాటు ఆగాల్సిందే.


అదే కటాఫ్ డేట్ :


నవంబర్లో తెలంగాణా ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో పాత షెడ్యూల్‌ ప్రకారం 2019 జనవరి 1ని కొత్త ఓటర్లకు  క్వాలిఫైయింగ్‌ తేదీగా నిర్ధారించగా, తాజా మార్పుల నేపథ్యంలో 2018 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండినవారికి మాత్రమే ఓటు హక్కు కల్పించనున్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్‌ 1న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. 

తాజా మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో రూపొందించిన ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది జనవరి తరువత 18 ఏళ్ళు నిండిన ఓటర్లకు అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేసే అవకాశం ఉందడన్నమాట.


అంతా కేసీయార్ చెప్పినట్లుగానే :


ఇక సవరించిన షెడ్యూల్ ప్రక్రారం తెలంగాణాలో ఓటర్ల నమోదు ప్రక్రియ ఇపుడు సాగబోతోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.  ఓటరు జాబితా రూపకల్పన షెడ్యూల్‌ పూర్తి కాగానే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత గరిష్టంగా 50 రోజులలోపు ఫలితాల ప్రకటనతో పాటు మొత్తం ప్రక్రియ పూర్తి చేయనుంది.

ఓటరు జాబితా తాజా షెడ్యూల్‌ ప్రకారం చూస్తే నవంబర్లో ఎన్నికలు,  డిసెంబర్‌ మొదటి వారంలోపే ఎన్నికల ఫలితాలు సైతం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: