40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబునాయుడు కూడా ప్ర‌త్య‌ర్ధిని చూసి మ‌రీ ఇంత‌లా భ‌య‌ప‌డతార‌ని ఎవ్వ‌రూ అనుకోలేదు. తెలంగాణాలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించి ఒక్క‌సారిగా రాజ‌కీయం వేడెక్కిపోయింది. టిఆర్ఎస్ అధినేత‌, ఆపద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కెసిఆర్ అయితే ఏకంగా 105 మందికి టిక్కెట్ల‌ను కూడా  ప్ర‌క‌టించేశారు. దాంతో అభ్య‌ర్ధుల విష‌యంలో మిగిలిన పార్టీల్లో కూడా వేడి రాజుకుంది. అందులో భాగంగానే కాంగ్రెస్-టిడిపి పొత్తుల విష‌యం కూడా జోరందుకుంది. 


అయితే, ఇక్క‌డ విష‌యం ఏమిటంటే రెండు రోజుల‌పాటు హైద‌రాబాద్ లోనే చంద్ర‌బాబు  మ‌కాం వేశారు. పిసిసి అధ్య‌క్షుడు  ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో  భేటీ జ‌రుగుతుంద‌ని జ‌రిగిన ప్ర‌చారం అబ‌ద్ధ‌మే అని తేలిపోయింది.   ఇద్ద‌రి మ‌ధ్య భేటీ జ‌రిగి పొత్తుల విష‌యాన్ని ప్ర‌కటించాల‌నే అనుకున్నార‌ట‌. కానీ చివ‌రి నిముషంలో ర‌ద్దు చేసుకున్నార‌ట‌. తెలుగుదేశంపార్టీ పుట్టుకే కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అటువంటిది కాంగ్రెస్-టిడిపిల మ‌ధ్య పొత్తు అంటేనే  టిడిపి వ్య‌వ‌స్ధాప‌కుడు ఎన్టీఆర్ కు నిజ‌మైన అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. పొత్తు ప్ర‌తిపాద‌న‌ల‌ను ఇప్ప‌టికే సీనియ‌ర్ మంత్రులిద్ద‌రు పూర్తిగా వ్య‌తిరేకిస్తున్న విష‌యం అంద‌రూ చూసిందే.


ఇటువంటి నేప‌ధ్యంలోనే  కాంగ్రెస్ తో పొత్తుల విష‌యంలో స్వ‌యంగా చంద్ర‌బాబే కూర్చోవ‌టం, పొత్తుల విష‌యాన్ని తానే ప్ర‌క‌టించ‌ట‌మంటే చాలా ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని భ‌య‌ప‌డ్డార‌ట‌. పైగా ఓటుకునోటు కేసు త‌ర్వాత తెలంగాణా సిఎం కెసిఆర్ పేరెత్తాలంటేనే చంద్ర‌బాబు భ‌య‌ప‌డిపోతున్నారు. రేపు పొత్తుల విష‌యం ఖాయ‌మైన త‌ర్వాత అభ్య‌ర్ధులకు ప్ర‌చారం చేయాలంటే ఏం చేస్తారో చూడాల్సిందే. 


పార్టీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం పొత్తుల విష‌యంతో పాటు  ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను కూడా  టిడిపి నేత‌ల‌నే చూసుకోమ‌ని చెప్పేశార‌ట‌. అభ్య‌ర్ధుల త‌ర‌పున ప్ర‌చారం చేయాలంటే ముందు మోడి, కెసిఆర్ ల‌నే టార్గెట్ చేయాలి. మోడిపై ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేస్తున్నారు కానీ కెసియార్ ను మాత్రం ప‌ల్లెత్తు మాట‌న‌లేక‌పోతున్నారు.  ఓటుకునోటు ఎఫెక్ట్ చంద్ర‌బాబుపై బాగానే ప్ర‌భావం చూపుతున్న‌ద‌నే విష‌యం అర్ధ‌మైపోతోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కెసిఆర్ గెలిస్తే ఇప్ప‌టి ప‌రిస్ధితే కొన‌సాగుతుందన‌టంలో సందేహం లేదు. అదే ఓడిపోతే మాత్రం చంద్ర‌బాబు రెచ్చిపోతారు. 


ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగి ఫ‌లితాలు వ‌చ్చేలోగానే  తొంద‌ర‌ప‌డితే  మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న విష‌యం చంద్ర‌బాబుకు బాగా తెలుసు. అందుక‌నే దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలంటున్నాయి. మ‌రి, తెలంగాణాలో ఎన్నిక‌ల‌కు చంద్ర‌బాబు దూరంగా ఉండేట్ల‌యితే టిడిపి అభ్య‌ర్ధుల‌ను దేకేదెవ‌రు ? ఎల్ ర‌మ‌ణ, పెద్దిరెడ్డిల‌ను చూసి ఎవ‌రైనా ఓట్లేస్తారా ?  ఇపుడైతే తెర‌వెనుక ఉండి మంత్రాంగం న‌డుతున్నా ఇబ్బంది లేదు. అదే ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లైన త‌ర్వాత కూడా తెర‌వెనుకే ఉండాల‌ని చంద్రబాబు నిర్ణ‌యించుకుంటే ఫ‌లితం ఎలాగుంటుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: