ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. గులాబీ గూటిలో అస‌మ్మ‌తి ర‌గిలిపోతోంది. ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థులు అస‌మ్మ‌తివ‌ర్గాల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇందులో ప్ర‌ధానంగా కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు, తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుకు ఊహించ‌ని షాకులు త‌గులుతున్నాయి. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగేలేద‌ని అనుకుంటున్న త‌రుణంలో సొంత‌పార్టీ నేత‌ల నుంచే అస‌మ్మ‌తి ఎదురుకావ‌డం ఆయ‌న‌కు ఒకింత ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఎర్ర‌బెల్లికి పోటీగా టికెట్ ఆశిస్తోంది ఎవ‌రో ద్వితీయ శ్రేణి నాయ‌కుడు కూడా కాదు.. ఏకంగా ఉమ్మ‌డి జిల్లా పార్టీ అధ్య‌క్షుడు, రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్‌రావు కావ‌డం గ‌మ‌నార్హం. 


పాల‌కుర్తి టికెట్ త‌న‌కే ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం త‌న పుట్టిన రోజు వేడుక‌ల సంద‌ర్భంగా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో సుమారు మూడువేల మంది అనుచ‌రుల‌తో ర‌వీంద‌ర్‌రావు స‌మావేశం నిర్వ‌హించారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఈ నాలుగేళ్ల‌లో పాల‌కుర్తికి ఎర్ర‌బెల్లి చేసింది ఏమీ లేద‌ని, తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను మొద‌టి నుంచీ టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాన‌నీ.. కానీ ఎర్ర‌బెల్లి టీడీపీ నుంచి వ‌చ్చార‌ని.. ఈసారి కేసీఆర్ త‌న‌కే టికెట్ ఇవ్వాల‌ని ఆ స‌మావేశంలో ర‌వీంద‌ర్ రావు చేసిన వ్యాఖ్య‌లు పార్టీవ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. 


ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత జంగా రాఘ‌వ‌రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎర్ర‌బెల్లిని ఓడించేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ర‌వీంద‌ర్‌రావు కామెంట్ల వెనుక జంగా ఉన్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. అంతేగాకుండా.. ఉమ్మ‌డివ‌రంగ‌ల్ జిల్లాలో తెలంగాణ ఉద్య‌మ‌కారుల సంఘం పేరుతో కార్య‌క‌లాపాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులోనూ పాల‌కుర్తిలో కాస్త ఎక్కువ‌గానే ఉన్నాయి. ఇవ‌న్నీ కూడా ఎర్ర‌బెల్లికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న కార్య‌క‌లాపాలేన‌నే టాక్ వినిపిస్తోంది. ఈ సంఘానికి జంగా రాఘ‌వ‌రెడ్డే ఆర్థిక‌వ‌న‌రులు స‌మ‌కూర్చుతున్న‌ట్లు స‌మాచారం. 


ఇక కేసీఆర్ ఎర్ర‌బెల్లికి టికెట్ ప్ర‌క‌టించిన త‌ర్వాత అస‌మ్మ‌తి వ‌ర్గం ఒక్క‌సారిగా భ‌గ్గుమంటోంది. ఈ క్ర‌మంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌కంగా ఉండే తొర్రూరు ప్రాంతం నుంచి కొంద‌రు నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఏకంగా పార్టీ జిల్లా అధ్య‌క్షుడే పాల‌కుర్తి టికెట్ కావాలంటూ లొల్లి చేయ‌డంతో పార్టీవ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేగుతోంది. గ‌తంలో కూడా పాల‌కుర్తిలో వేలుపెట్టేందుకు ర‌వీంద‌ర్‌రావు ప్ర‌య‌త్నం చేయ‌గా కేసీఆర్ తీవ్రంగా మంద‌లించిన‌ట్లు తెలిసింది. ఇప్పుడు ఏకంగా స‌మావేశ‌మే నిర్వహించ‌డంపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: