ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ అత్యంత కీల‌కం. ఈ ఎన్నిక‌ల్లో తెలంగాణ సీఎంను నిర్ణ‌యించేది దీని ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాలే. గ్రేట‌ర్లో ఉన్న 24స్థానాల్లో ఎవ‌రు ఎక్కువ సీట్లు సాధిస్తే.. ఆ పార్టీనే అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇక టీఆర్ఎస్ పార్టీకి అయితే మ‌రీ ముఖ్యం. ఎందుకంటే 2014 ఎన్నిక‌ల్లో చాలా జిల్లాల్లో ఆ పార్టీ దాదాపుగా అన్నిసీట్ల‌ను కైవ‌సం చేసుకుంది. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. ఈ ఎన్నిక‌ల్లో ఆయా సిట్టింగ్ స్థానాల్లో చాలావ‌ర‌కు గండిప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆ లోటును గ్రేట‌ర్‌లో పూరించుకోవాల‌ని కేసీఆర్ వ్యూహం ర‌చిస్తున్నారు. ఇక్క‌డ సాధించే సీట్ల‌పైనే ఆయ‌న విజ‌యావ‌కాశాలు ఉంటాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. 

Image result for greater hyderabad

అసెంబ్లీని ర‌ద్దు చేసి, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు 105మందిని అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో ఒక్క‌సారిగా గ్రేట‌ర్ గులాబీలో గ‌లాట మొద‌లైంది. ఆశావ‌హులు, పార్టీలో మొద‌టి నుంచి ప‌నిచేస్త‌న్న నాయ‌కులు భ‌గ్గుమంటున్నారు. టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇది నిజంగా కేసీఆర్‌కు ఊహించ‌ని షాకేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఈ అసంతృప్తిని చ‌ల్లార్చ‌కుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తికూల ఫ‌లితాలు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు. నిజానికి.. 2014 ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్‌లో టీఆర్ఎస్ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. ఒక‌టి రెండు స్థానాల‌కే ప‌రిమితం అయింది. ఇదే స‌మ‌యంలో టీడీపీ స‌త్తాచాటింది. 


ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణ‌య్య త‌ప్ప మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు దాదాపుగా అధికార టీఆర్ఎస్లో చేరిపోయారు. ఇప్పుడు కేసీఆర్ ప్ర‌క‌టించిన టికెట్లు కూడా వీరికే ద‌క్కాయి. దీంతో మొద‌టి నుంచి ప‌ని చేస్తున్న‌వ‌ర్గం భ‌గ్గుమంటోంది. కూకట్‌పల్లి నియోజకవర్గం పార్టీలో అసంతృప్తి పెల్లుబికింది. టీఆర్ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావును మార్చాలని పలువురు డిమాండ్‌ చేశారు. ఇందుకోసం అవ‌స‌ర‌మైతే.. కేసీఆర్‌ ఇంటిని కూడా ముట్టడించడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. పార్టీ ఆరంభం నుంచి ఉన్న‌ వివిధ ప్రాంతాలకు చెందినవారు టీఆర్ఎస్‌ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి తేళ్ల నర్సింగ్‌రావు నేతృత్వంతో మూసాపేటలో స‌మావేశం కావ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 


ఈ సందర్భంగా వారు కేసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. శేరిలింగంప‌ల్లిలో తాజా మాజీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కేసీఆర్ టికెట్ కేయించ‌డంపై ప‌లువురు నాయ‌కులు భ‌గ్గుమంటున్నారు. కుత్భుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో వివేక్‌కు కాకుండా.. గ‌తంలో టీఆర్ఎస్ నుంచి బ‌రిలోకి దిగిన హ‌న్మంత‌రెడ్డికి టికెట్ ఇవ్వాల‌నే డిమాండ్ వ‌స్తోంది. జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్‌కు వ్య‌తిరేకంగా ఓవ‌ర్గం ప‌నిచేస్తోంది. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో భేతి సుభాష్‌రెడ్డికి కాకుండా మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌కు టికెట్ ఇవ్వాల‌నే డిమాండ్ వ‌స్తోంది. ఈ మేర‌కు ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో స‌మావేశం కావ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 


ఇక మ‌ల్కాజ్‌గిరి టికెట్ ఆశించిన గ్రేట‌ర్ సిటీ పార్టీ క‌న్వీన‌ర్ మైనంప‌ల్లి హ‌న్మంత‌రావుకు టికెట్ ద‌క్క‌లేదు. ఈ స్థానంలో తాజా మాజీ ఎమ్మెల్యే క‌న‌కారెడ్డి కోడ‌లు విజ‌య‌శాంతికి టికెట్ కేటాయించారు. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు మైనంప‌ల్లి సిద్ధ‌మ‌వుతున్నారు. అలాగే ముషీరాబాద్ టికెట్ ఆశించిన మంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డి అల్లుడికి కాకుండా మ‌రొక‌రికి టికెట్ ఇచ్చారు. దీంతో నాయిని గుర్రుగా ఉన్నారు. గ్రేట‌ర్‌లో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న టీఆర్ఎస్ కు అస‌మ్మ‌తి సెగ‌తో భారీ న‌ష్ట‌మే జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: