తెలంగాణ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. దాదాపు ఐదు నెల‌ల ముందుగానే ఇక్క‌డ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ముంద‌స్తు ముచ్చ ట‌కు తెర‌దీసిన టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌.. అనూహ్యంగా త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకున్నారు. ఫ‌లితంగా ఆయ‌న చెప్పిన షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎన్నిక‌లు జ‌రిగేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్టు క‌నిపిస్తోంది. న‌వంబ‌రులో ఎన్నిక‌లు ముగిసి అదే నెల చివ‌రి నాటికి ఫ‌లితాలు కూడా వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీంతో డిసెంబ‌రు నాటికి ప్ర‌భుత్వం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. దీంతో అన్ని రాజ‌కీయ ప‌క్షాలూ కూడా త‌మ త‌మ వ్యూహాల‌ను రెడీ చేసుకుని ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ఇక‌, తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితిని చూస్తే.. కేడ‌ర్ ఉన్నా నాయ‌కులు లేని ప‌రిస్థితి నెల‌కొంది. అయినా కూడా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాల‌ని, తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యాన్ని పెంచాల‌న్న‌ది పార్టీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం. 


ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని పార్టీ నేత‌ల‌తో ఇటీవ‌ల భేటీ అయిన చంద్ర‌బాబు.. పొత్తులపై పూర్తి స్వేచ్ఛను టీ టీడీపీ నేతలకే అప్పగించారు. అయితే, అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌ల‌ ప్రచార బాధ్యతలను ఎవరిపై  మోపనున్నారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కీలక బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారని పార్టీ నేతలు చెప్పినప్పటికీ.. ఏపీ సీఎంగా ఉన్న టీడీపీ అధినేతకు పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్రచారంపై దృష్టి సారించే అవకాశం ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. అందువల్ల మంత్రి, బాబు త‌న‌యుడు నారా లోకేష్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. అయితే, ప్ర‌జాక‌ర్షణ విష‌యంలో లోకేష్ ఎంత‌మేర‌కు స‌క్సెస్ అవుతాడ‌నే చింత పార్టీని వేధిస్తోంది. ఒక్క పిలుపుతో వేల మందిని మేనేజ్ చేయ‌గ‌ల నేర్పు లోకేష్‌కు ఉందా? అనేది సందేహ‌మే! ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వ్యూహం మ‌రోలా ఉంద‌ని అంటున్నారు. 


2009 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ తరపున ప్రచారం చేసే అవకాశాలు చూచాయ‌గా కనిపిస్తున్నాయి. అయితే అందుకు కారణాలు లేకపోలేదు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి జూనియర్ ఎన్టీఆర్, అతని కుటుంబం ఇప్పట్లో తేరుకోలేని పరిస్థితి. అయితే తండ్రి చనిపోయిన బాధలో ఉన్న కష్టకాలంలో కుటుంబం వెంట నిలిచిన చంద్రబాబు కోరితే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వచ్చే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ఈ ప్రచార బాధ్యతలపై చంద్రబాబు ప్రకటన చేస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా.. తెలంగాణ‌లో టీడీఈప పుంజుకునేందుకు.. జూనియ‌ర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి బాబు వ్యూహం ఏంటో తెలియాలంటే వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు!


మరింత సమాచారం తెలుసుకోండి: