తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాశ్ రెడ్డి) అంటే తెలియని వారు ఉండరు.  ప్రతి విషయంలోనూ వివాదాస్పద వ్యక్తిగా ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు జగ్గారెడ్డి.  తాజాగా భార్యాపిల్లల పేరుతో గుజరాతీ కుటుంబాన్ని అమెరికాకు అక్రమ రవాణా చేశారన్న కేసులో  జగ్గారెడ్డి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.   ఈ రోజు ఉదయం జగ్గారెడ్డిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను ఉత్తర మండల డీసీపీ కార్యాలయానికి తరలించారు.


అయితే  రాహుల్ సభ తర్వాత తనను అరెస్ట్ చేసేందుకు కేసీఆర్, హరీశ్ రావు కుట్ర చేశారన్నారు. సిద్ధిపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి హరీశ్ రావును గెలిపించుకునేందుకే తనను అరెస్ట్ చేశారని జగ్గా రెడ్డి అన్నారు.  కాగా, గుజరాత్ కు చెందిన ముగ్గురిని తన కుటుంబసభ్యులుగా పేర్కొంటూ 2004లో వారిని అమెరికాకు తరలించారంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.


ఈ ముగ్గురి వద్ద నుంచి రూ. 15 లక్షలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 419, 490, 467, 468, 471, 370, పాస్ పోర్టు యాక్ట్ సెక్షన్ 12, ఇమిగ్రేషన్ యాక్ట్ సెక్షన్ 24 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో జగ్గారెడ్డిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: