పోల‌వ‌రం ప్రాజెక్టులో ఈరోజు చంద్ర‌బాబునాయుడు గ్యాల‌రీ వాక్ అరేంజ్ చేశారు. పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ప్రాజెక్టు సైట్ కు తీసుకెళ్ళి జ‌రుగుతున్న ప‌నుల‌ను వివ‌రిస్తార‌ట‌. భ‌లేగుంది క‌దా చంద్ర‌బాబు హ‌డావుడి. అధికారంలోకి వ‌చ్చిన నాలుగున్న‌రేళ్ళ‌ల్లో చేసింది మ‌హా ఉంటే 20 శాతం ప‌నులు. అంత‌దానికే మొత్తం పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌న్నీతానే  చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తుండ‌టం విచిత్రంగ  ఉంది. ఈరోజు టిడిపి ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ప్రాజెక్టు వ‌ద్ద‌కు తీసుకెళుతున్నారు లేండి. ఎందుకంటే, పైలాన్ ఆవిష్క‌రిస్తున్నార‌ట‌. అందుక‌నే ఈ హ‌డావుడి. 


నిజానికి పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల్లో వేగం పెరిగింది దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ హ‌యాంలోనే. సుమారు 40 శాతం ప‌నులే వైఎస్ హ‌యాంలోనే జ‌రిగాయి.  చంద్ర‌బాబు సిఎం అయిన తర్వాత జ‌రిగింది త‌క్కువే. కాక‌పోతే ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన 58 శాతం ప‌నుల‌ను తానే చేసినంత బిల్డ‌ప్ ఇస్తుంటారు చంద్ర‌బాబు. ఇత‌రుల హ‌యాంలో జ‌రిగిన ప‌నుల‌ను కూడా త‌న ఖాతాలో వేసుకోవ‌టం చంద్ర‌బాబుకు మొద‌టి నుండి ఉన్న అల‌వాటే. పోల‌వ‌రం ప్రాజెక్టులో ప‌నుల‌న్నీ  శ‌ర‌వేగంగా జ‌రిగిపోతోంద‌నే బిల్డ‌ప్ ఇస్తున్నారు చంద్ర‌బాబు. నిజానికి అక్క‌డ ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న న‌డుస్తున్న  విష‌యం అంద‌రికీ తెలిసిందే. కాక‌పోతే ఏదో మ‌ద్ద‌తుగా నిల‌బ‌డే మీడియా ఉంది కాబ‌ట్టి నెట్టుకొచ్చేస్తున్నారంతే.


ఇప్ప‌టికే ప్రాజెక్టులో  ర‌క‌ర‌కాల కార్య‌క్ర‌మాల పేరుతో చంద్ర‌బాబు కోట్ల రూపాయ‌లు అచ్చంగా ప‌బ్లిసిటీకే  వృధా చేశారు. చేసిన ప‌నుల‌కే మ‌ళ్ళీ మ‌ళ్ళీ శంకుస్ధాప‌న‌లు చేయ‌టంతో పాటు చివ‌రకు గేట్లు బిగించ‌టం, ఎత్తటం లాంటి ప‌నుల‌కు కూడా స్వ‌యంగా చంద్ర‌బాబే హాజ‌ర‌వుతున్నారు. నిజానికి ఇవ‌న్నీ అధికారుల స్ధాయిలోనే జ‌రిగిపోవాల్సిన రొటీన్ ప‌నులు. తాజాగా పైలాన్ ఆవిష్క‌ర‌ణ పేరుతో చేస్తున్న హ‌డావుడికి  మ‌ళ్ళీ భారీ ఖ‌ర్చు తప్ప‌దు. మొన్న‌నే ప్రాజెక్టు స్పిల్ వే ప‌నుల్లో నాసిర‌కం ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు కేంద్ర ప‌రిశీల‌న క‌మిటి నిర్ధారించింది. అటువంటి వాటిని ప్ర‌జా ప్ర‌తినిధులు అధికారుల‌ను ప్ర‌శ్నించే అవ‌కాశం ఎటూ లేదు కదా ? 


జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌ల‌పై నోరెత్తే అవ‌కాశం ఎటూలేదు. మ‌రి ఇంతోటి దానికి వంద‌ల‌మంది ప్ర‌జా ప్ర‌తినిధులు అక్క‌డికి ఎందుకు ? ఖ‌ర్చు దండ‌గ కాక‌పోతే ?  పోల‌వ‌రం శ‌ర‌వేగంగా జ‌రిగిపోతుంద‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గాల్లో వీళ్ళంతా హ‌డావుడి చేయ‌టానికి త‌ప్ప ఇంకెందుకు ఉప‌యోగ‌ప‌డ‌దు. ఈ గ్యాల‌రీ వాక్  ప‌ర్య‌ట‌న‌లో  కొస‌మెరుపేమిటంటే టిడిపి స‌భ్యుల‌తో క‌లిసి బిజెపి శాస‌న‌స‌భాప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా వెళ్ళ‌టం.







మరింత సమాచారం తెలుసుకోండి: