తెలంగాణలో అసెంబ్లీ రద్దు అయిన తర్వాత కేసీఆర్ 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు బాబు మోహన్, నల్లాల ఓదేలు పేర్లు లేకపోవడంతో టీఆర్‌ఎస్ పార్టీలో టికెట్ మంట రాజుకుంది. దాంతో మాజీ ఎమ్మెల్యే ఒదేలు తనను తాను గృహ నిర్భందం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  తాజాగా  మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంపీ బాల్క సుమన్ ఎన్నికల ప్రచారంలో విషాదం చోటుచేసుకుంది.  మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ అతడి అనుచరుడు గట్టయ్య ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.  గట్టయ్యతో పాటు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.


చెన్నూరులోని ఇందారంలో బుధవారం  చోటు చేసుకుంది. ఇందారంలో బాల్క సుమన్ ప్రచారాన్ని అడ్డుకుంటూ నల్లాల ఓదేలు అనుచరులు భారీ ర్యాలీ చేపట్టారు. ఇదే సమయంలో బాల్క సుమన్ ఎన్నికల ప్రచార నిమిత్తం అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో గట్టయ్య అనే వ్యక్తి వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒక్కసారిగా ఒంటిపై పోసుకున్నాడు. అనంతరం పెట్రోలు డబ్బా నుంచి మరికొంత పెట్లోలును గాలిలోకి వెదజల్లాడు.  దాంతో పక్కనే ఉన్న మరికొంత మందిపై పెట్రోల్ పడటంతో ఆ మంటలు వారికీ అంటుకున్నాయి.


చూస్తుండగానే నలుగురైదుగురు కార్యకర్తలకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన పోలీసులు, కార్యకర్తలు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.  ఇదిలా ఉంటే..ఓదెలు అనుచరులు తనపై హత్యాయత్నం చేశారని బాల్క సుమన్ తెలిపారు. ఓదెలు అనుచరులు తనపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారని, కార్యకర్తలు, పోలీసులే తనని కాపాడారని సుమన్ చెప్పారు.  ఎన్ని అవరోధాలు సృష్టించినా చెన్నూరు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: