ఏపీలో కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు ఏ రోజుటి ఎలా ఏ పార్టీకి అనుకూలంగా మారతాయో, ఏ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతాయో అంచనాలకే అంతుపట్టడం లేదు. జనసేన ఎంట్రీతో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీకి చెందిన కీల‌క నాయకులు ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు జనసేనకు క్యూ కట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే వైసీపీ నుంచి కీలక నేతలుగా ఉన్న వారు ఇతర పార్టీల్లోకి జంప్‌ చేసేస్తున్నారు. ఆ పార్టీ అధినేత జగన్‌ తీసుకున్న నిర్ణయాలతో షాక్‌లోకి వెళ్లిపోయిన వైసీపీ నాయకులు కోలుకుని తమ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీ లేదా జనసేన వైపు చూస్తున్నారు. 


తాజాగా ముమ్మడివరం నియోజకవర్గ వైసీపీ మాజీ సమన్వయకర్త పితాని బాలకృష్ణ జనసేనలోకి జంప్‌ చేసేసిన సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి వచ్చిన బాలకృష్ణకే పవన్‌ అనూహ్యంగా జనసేన పార్టీ తరుపున తొలి సీటును ఖ‌రారు చేసి సంచలనం రేపారు. పితాని బాలకృష్ణ షాక్‌ అలా ఉంటే కీలక నియోజకవర్గమైన రామచంద్రపురంలో నియోజకవర్గ సమన్వయకర్త చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను మార్చాలని... ఆయన నియోజకవర్గానికి స్థానికేతుడని, ఓ వర్గం నానా రచ్చరచ్చ చేస్తోంది.ఈ గొడవలే ఇలా ఉంటే కాకినాడ సిటీలోను, రాజమండ్రి రూరల్‌లోను అదే పరిస్థితి నెలకొంది. ఈ గొడ‌వ‌లు ఇలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా వైసీపీకి మరో అదిరిపోయే ఎదురు దెబ్బ తగలనుంది. 


ఆ పార్టీ కీలకనేత కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి సునీల్‌ వైసీపీకి గుడ్‌ బై చెప్పి టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా చెప్పాలంటే గత ఏడాది కాలం నుంచి సునీల్‌ టీడీపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. వ్యాపారవేత్త‌ అయిన సునీల్‌ కాకినాడ లోక్‌సభకు రెండు సార్లు పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీని మూడో ప్లేస్‌కు నెట్టి రెండో స్థానంలో నిలిచారు. నాటి కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజుకు గట్టి పోటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన సునీల్‌ ప్రస్తుత ఎంపీ తోట నరసింహం చేతిలో కేవలం 3వేల ఓట్లతోనే ఓడిపోయారు. 

Related image

వ్య‌క్తిగ‌తంగా సౌమ్యుడు అన్న పేరును సునీల్‌కు కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. సునీల్‌ సోదరుడు, చంద్రబాబు తనయుడు లోకేష్‌కు సన్నిహితుడు కావడంతో సునీల్‌ సోదరుడు ద్వారా ఆయనను టీడీపీలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ఏడాది కాలంగా జరుగుతున్నాయి. సునీల్‌ ఇప్పుడైన టీడీపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఇక సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డితో ఉన్న వివేధాల నేపథ్యంలో సునీల్‌కు జగన్ ప్ర‌యార్టీ ఇవ్వడం తగ్గించేశారు. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న సునీల్‌ ఎప్పుడు పార్టీ మారదామని వేట్‌ చేసే ధోరణతో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే నెల 2వ తేదీన సునీల్‌ టీడీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఆయన పార్టీ మారతారన్న వార్తలతో వైసీపీ అధిష్టానం ఆయనను కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. 

Image result for chandrababu

ఇక తాజాగా అమరావతిలో సీఎం చంద్రబాబును సునీల్‌ కలిసినట్టు టీడీపీ వర్గాల ద్వారా సమాచారం బయటకు పొక్కింది. టీడీపీలో చేరే అంశంపై చంద్రబాబు, సునీల్‌ మధ్య చర్చలు జరిగాయని పార్టీలో చేరిన వెంటనే సునీల్‌కు కాకినాడ లోక్‌సభ సీటుపై హామీ వస్తుందని తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.  ఇదిలా ఉంటే సునీల్‌కు కాకినాడ ఎంపీ సీటు ఇస్తే ప్రస్తుతం ఎంపీగా ఉన్న తోట నరసింహం పరిస్థితి ఏంటన్న దానిపై కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తోట నరసింహం వైసీపీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని కొంత మంది, ఆయన జనసేనలోకి జంప్‌ చేస్తారని మరి కొంత మంది చర్చించుకుంటున్నారు.ఏదేమైనా సునీల్‌ వైసీపీకి గుడ్‌ బై చెప్పడం ఆ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే. ఇప్పటికే అభ్యర్థుల కొరతతో సతమతమౌతున్న తూర్పు వైసీపీకి సునీల్‌ రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. మరి తూర్పు వైసీపీలో ఎగసిపడుతున్న ఈ అస‌మ్మ‌తి జ్వాలలను జగన్‌ ఎలా చల్లారుస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: