అవును! ఇప్పుడు ఈ ప్ర‌శ్నే నెటిజ‌న్లు సంధిస్తున్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న వ్య‌వ‌హార శైలిని మార్చుకోవాల‌ని కూడా సూచిస్తున్నారు. రాష్ట్రం ఓ ప‌క్క తీవ్ర‌మైన అప్పుల్లో కూరుకుపోయింద‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. దీనికితోడు కేంద్రం నుంచి స‌మ‌యానికి సాయం కూడా అంద‌డం లేద‌ని మీడియా ముఖంగా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన వారు నిజంగానే ఏపీ సీఎం చెప్పే మాట‌లు నిజ‌మే అనుకుంటారు. కానీ, వాస్త‌వం ఎలా ఉందో ఏమో తెలియ‌దు కానీ, చంద్ర‌బాబు చేస్తున్న అతిశ‌యోక్తుల‌కు మాత్రం అడ్డు, అదుపు ఉండ‌డం లేదు. చేతికి ఎముక లేకుండా ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేసేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Image result for polavaram

తాజాగా ఆయ‌న పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద సృష్టించిన హంగామా అంతా ఇంతా కాద‌ని ఆంగ్ల మీడియా విమ‌ర్శ‌లు రువ్వింది. పోల‌వ‌రం ప్రాజెక్టులోని స్పిల్‌వేలో నిర్మించిన గ్యాలరీ మాత్రమే పూర్తయిన సందర్భంగా రూ.కోట్లు ఖర్చు పెట్టి, అసలు ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోయిందన్నంత హడావుడి చేశారు. గ్యాలరీ వాక్‌ను ఫ్యామిలీ పిక్నిక్ ఈవెంట్‌లా మార్చేశారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్లతో కలిసి ప్రాజెక్టులోని గ్యాలరీలో నడిచారు. ఫొటోలకు ఫోజులిచ్చారు. మనవడిని చూసి మురిసిపోవడం, అతడితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. 

Image result for chandrababu family

సీఎం చంద్రబాబు కేవలం ప్రచారం కోసం పాకులాడుతూ ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టి, గ్యాలరీ వాక్‌ పేరిట హంగామా చేశారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.  వాస్త‌వానికి ఇంత హ‌డావుడి అక్క‌ర్లేదు అంటున్నారు ఇంజ‌నీరింగ్ నిపుణులు. ప్రాజెక్టు జలాశయం నుంచి వరద నీటిని స్పిల్‌ వే ద్వారా దిగువకు విడుదల చేస్తారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే భద్రత కోసం దానికి దిగువన గ్యాలరీ నిర్మించారు. 2 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల ఎత్తుతో గ్యాలరీ ఉంటుంది. జలాశయంలో నిల్వ ఉండే నీటి ఒత్తిడి స్పిల్‌వేపై పడకుండా చూడటం కోసం దీన్ని నిర్మిస్తారు. ఏ ప్రాజెక్టులో అయినా గ్యాలరీ నిర్మించడం సహజమే. ఇది పూర్తయితే ప్రాజెక్టు నిర్మాణం మొత్తం పూర్తయినట్లు కాదు. 


పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యతపై ఇటీవల కేంద్ర నిపుణుల కమిటీ పలు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కప్పిపుచ్చి, ప్రజలను ఏమార్చేందుకే టీడీపీ ప్రభుత్వం గ్యాలరీ వాక్‌ నిర్వహించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మ‌రోప‌క్క‌, ప్ర‌జాధ‌నాన్ని కూడా చంద్ర‌బాబు వృథా చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు జోరందుకున్నాయి. త‌న ఫ్యామిలీకి కూడా ప్ర‌జాధ‌నం వినియోగించే కార్లు ఏర్పాటు చేశార‌ని అంటున్నారు. మ‌రి దీనికి టీడీపీ త‌మ్ముళ్లు ఏం స‌మాధానం చెబుతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: