కేవలం నా తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లిచేసుకున్నారని నెపంతో..కోపంతో నా భర్తను అన్యాయంగా నా కళ్లముందే నరికి చంపించారు.  ఎక్కడైనా తల్లిదండ్రులు పిల్ల సంతోషాన్ని కోరుకుంటారు..కానీ నా తండ్రి మాత్రం నా మాంగళ్యాన్ని నా కళ్లముందే తెంపేశారు..అలాంటి దుర్మార్గపు తండ్రి ఏ కూతురుకి ఉండకూడదు..నా భర్తను చంపించిన నా తండ్రిని ఉరితీయండి అంటూ ఆక్రోశంతో రోదిస్తుంది..ఓ అభాగ్యురాలు.  ఆమె ఎవరో కాదు..నిన్న మిర్యాలగూడలో దారుణంగా హత్యకు గురిఅయిన ప్రణయ్ సతీమణి అమృత. 

ఓకే ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకుంటున్న తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నానని..తన పెళ్లి తండ్రికి మొదటి నుంచి ఇష్టం లేదని..అందుకే నా భర్తను చంపించడానికి.. నయీం గ్యాంగ్ తో కొన్ని రోజులుగా కాంటాక్ట్ పెట్టుకొని..నిందితుడికి సుపారీ ఇచ్చి తన భర్తను చంపించాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను పుట్టింటికి వెళ్లబోనని స్పష్టం చేసింది. ప్రస్తుతం మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు మీడియాతో మాట్లాడింది. 

ప్రణయ్ ను చంపేస్తే తాను పుట్టింటికి వచ్చేస్తానని తండ్రి భావించాడని అమృత చెప్పింది. తన ప్రేమ వ్యవహారం తెలిసిన వెంటనే బాబాయ్ శ్రవణ్ తనను డంబెల్ తో కొట్టాడనీ, కిందపడేసి తన్నాడని వెల్లడించింది. అప్పట్లో ప్రణయ్ తో మాట్లాడితే చంపేస్తానని తండ్రి కూడా బెదిరించాడని వాపోయింది.   హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ కు వెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నామని అమృత తెలిపింది. 

తాను నెల తప్పినట్లు తెలియగానే వెంటనే అబార్షన్ చేసుకోవాలని తండ్రి మారుతీరావు ఒత్తిడి చేశాడని ఆమె వెల్లడించింది. ఈ విషయాన్ని తల్లికి చెప్పవద్దని హెచ్చరించినట్లు అమృత మీడియాకు తెలిపింది.  తామిద్దరం శుక్రవారం ఆసుపత్రిలో ఉండగా ఆయన ఫోన్ చేశారని అమృత తెలిపింది. తాను ఎక్కడున్నానో తెలిసిపోతుందన్న భయంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పింది.  తన భర్తను చంపించిన తన తండ్రికి కఠినమైన శిక్షపడాలని కన్నీరు మున్నీరైంది అమృత.


మరింత సమాచారం తెలుసుకోండి: