నాకు ఎటువంటి కుట్రలు కుతంత్రాలు తెలియవు, తెలిసిందల్లా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడమే, ఏది చేసినా ప్రజల కోసమే చేస్తాను, అభివ్రుధ్ధి కోసమే చేస్తాను... శ్రీకాకుళంలో ఈ రోజు జల హారతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేసారు. . ప్రజల కోసం ప్రతి నిత్యం ఆలోచన చేసే నేను  టార్గెట్ అవుతున్నానని తన గురించి తాను  చెప్పుకుంటూ  తెగ బాధపడిపోయారు. 


అన్న గారి ఎపిసోడ్ ఏంటో మరి :


కుట్రలు చేసి నన్ను సొంత అల్లుడే పదవి నుంచి తొలగించాడని సాక్షాత్తు అన్న నందమూరి పెట్టిన ఆక్రందన తెలుగు జాతి ఎన్నడూ మరువలేనిదే. మరి బాబు ఏ కుట్ర తెలియదని అంటున్నారు, సొంత మామ ఇలా అంటారేమిటని ఎవరూ అడగకూడదేమో. అప్పటి వరకూ  కలసి  ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలకు  హఠాత్తుగా  తలాక్ ఇచ్చేసి వాజ్ పేయి కూటమిలోకి దూకేయడం వెనక ఏ కుతంత్రం లేదనుకోవాలేమో.


ఈ మధ్యనే మరణించిన నందమూరి హరి క్రిష్ణను ఎమ్మెల్యే కాక ముందే మంత్రిని చేసి గెలిచొచ్చాక పక్కన పెట్టేయడం వెనక ఏ కుట్రా లేదనుకోవాలేమో. సీఎం కావడానికి సహకరించిన తోడల్లుడు దగ్గుబాటిని ఉప ముఖ్యమంత్రి కాదు కదా ఉప్పూ పత్రి లేకుండా చేసిన దాన్ని కుత్రంత్రం అనరేమో. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు డిక్షనరీలో ఈ పదాలకు వెరే అర్ధాలు ఉన్నాయేమో అనుకోవాలి మరి.


ఒక్కసారి అంటే :


ఎపుడో రెన్నెళ్ళ క్రితం మోడీ పార్లమెంట్ లో అన్నారట. కేసీయార్ కి ఉన్న పరిపక్వత వ బాబుకు లేదు అని, అది ఎంత మంది విన్నారో లేదో తెలియదు కానీ బాబు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే పట్టుకును గిచ్చుకుంటూ వెళ్ళిన ప్రతి సభలో అదే చెబుతున్నారు. తనకు పరిపక్వత లేదని మోడీ అన్నారని. దీని వల్ల సానుభూతి వస్తుందని బాబు అనుకోవచ్చు కానీ. విమర్శను సైతం పాజిటివ్ గా  స్వీకరించే దాన్ని కూడా  పరిపక్వత అనే అంటారు. మరి ఇపుడు మోడీ చెప్పింది రైటో  రాంగో జనమే నిర్ణయించాలి. 


కేసులు పెడుతున్నారు :


తనపై కుట్రతోనే కేసులు పెడుతున్నారని బాబు అంటున్నారు. తాను ఆనాడు తెలంగాణా కోసం పోరాడానని, అపుడు వదిలేసి ఎనిమిదేళ్ళ తరువాత నాన్ బైలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం అంటే కచ్చితంగా అది కుత్రంత్రమేనని వాపోయారు. బీజేపీ, వైసీపీ కుమ్మక్కు అయి కేసులు పెట్టించారని కూడా బాబు ఆరోపించారు. మరి, నాడు కేసులు పెట్టిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటూ బీజేపీపై విమర్శలు చేయడాన్ని ఏ కుట్ర అనాలో కూడా బాబే చెబితే బాగుంటుందని సెటైర్లు పడుతున్నాయి. మొత్తానికి అది ఏ సభ అయినా బాబు మాత్రం సర్కారీ ఖర్చు రాసేసి మరీ ఎన్నికల ప్రసంగాలు ఎంచక్కా చేసుకుంటూ పోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: