ఏ కారణం చేత తెలంగాణాకు కేసీయార్ ముందస్తు ఎన్నికలు తెచ్చారో కానీ మొత్తానికి ఆ రాష్ట్రాన్ని పొలిటికల్ లాబరేటరీ గా అన్ని పార్టీలు మార్చేసుకుంటున్నాయి. అక్కడ ఫలితాలను బట్టి రేపటి అడుగులు ఎలా వేయాలన్నది చూసుకోవాలనుకుంటున్నాయి. ఇందులో జాతీయ, ప్రాంతీయ  పార్టీలు సైతం పోటీ పడుతున్నాయి. 


కేసీయార్ ఇలా :


తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు పెట్టించుకున్న కేసీయార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం ఖాయమన్న ధీమాతో ఉన్నారు. ఇక్కడ నెగ్గితే రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల్లో విశ్వరూపం చూపించవచ్చునని ఆయన ఆలోచన. పైగా ఈ ఫలితాలను బట్టి భవిష్త్యత్తు సమీకరణలు కూడా బేరీజు వేసుకోవాలనుకుంటున్నారు. అసెంబ్లీ వరకు మజ్లిస్ తో పొత్తు పెట్టుకున్న కేసీయార్, ఎంపీ సీట్ల దగ్గరకు వచ్చెసరికి ఎలా వ్యవహరిస్తారన్నది ఈ ఫలితాలు చెప్పబోతున్నాయి. 


వాళ్ళదీ అదే తీరు :


ఇక బద్ద శత్రువుల్లా ఉండే కాంగ్రెస్, టీడీపీ తెలంగాణా ఎన్నికల పుణ్యమా అని చేతులు కలిపాయి. ఇపుడు ఆ రెండు పార్టీల పొత్తు పై జనం తీర్పు ఎలా ఉంటుందన్నది చూడాలంటే తెలంగాణా ప్రయోగశాల కావల్సిందే. పొత్తుకు జనం జై కొడితే ఏపీలోనూ కంటిన్యూ చేస్తారు. రేపటి రోజున కేంద్రంలోనూ రెండూ కలసి ముందుకు వస్తాయి. అదే సీన్ రివర్స్ అయితే మరో ఆప్షన్ వెతుక్కుంటాయి. అంటే ఆ రెండు పార్టీలకు తెలంగాణా లిట్మస్ టెస్ట్ అన్నమాట.


బీజేపీ రూట్ :


ఇక కమలధారులకు తెలంగాణాలో సొంత బలం ఎంత ఉందన్నది ఈ ఎన్నికల్లో తేలిపోతుంది. గత సారి టీడీపీతో పొత్తు పెట్టుకుని అయిది ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఎన్ని సీట్లు సాధిస్తుందన్నది ఆ పార్టీకి పెద్ద ప్రశ్న. దానికి సమాధానమే తెలంగాణా ప్రయోగం. మరి ఇక్కడ సక్సెస్  అయితే రేపటి ఎంపీ ఎన్నికల్లో రాయబేరాలు, సీట్ల పంపకాల్లో బీజేపీ ఓ రేంజిలో వాయిస్ పెంచేందుకు చాన్స్ ఉంది. మరి సీన్ రివర్స్ ఐతే కొత్త సమీకరణలు చూడాల్సిందే.


ఉనికి పోరాటం :


ఇక తెలంగాణాలో ఉన్న వామపక్షాలు, కొత్తగా పార్టీ పెట్టిన కోదండరాం వంటి వారికి ఉనికి సమస్య, తమ బలం ఎంత అన్నది వాళ్ళు తేల్చుకోవడానికి తెలంగాణా ముందస్తు  ప్రయోగం ఎంచక్క సరిపోతుంది. ఇక వైసీపీ, జనసేన ఎలాంటి స్టాండ్ తీసుకుంటే వర్కౌట్ అవుతుందన్నది తేల్చేదీ తెలంగాణాయే. మొత్తానికి అందరికీ పెద్ద ఎస్పెరిమెంట్ గా ముందస్తు ఎన్నికలు బాగా యూజ్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: