కొత్త రాజకీయం చేస్తాం.. అన్నీ మారుస్తాం, సామాన్యుడే మాకు ముఖ్యం, పాత కాలం బూజులు పోవాలి అంటూ అందమైన నినాదాలు ఇచ్చిన ఆ పార్టీ ఇపుడు అదే చింతకాయ పచ్చడిని ఏరి కోరి చేరదీస్తోంది. యువతకు పెద్ద పీట వేస్తాము, రాజకీయాల్లోకి అంతా రావాలంటూ గట్టి స్లోగన్స్ ఇచ్చిన పెద్దలు ఇపుడు ఫిరాయింపు నేతలనే ఇష్టపడుతున్నారు. వాటే  పాలిట్రిక్స్.


టార్గెట్ రెడీ :


రేపటి ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేందుకు జనసేన పెద్దగా వ్యూహలు ఏవీ పెట్టుకోవడంలేదనిపిస్తోంది. వడపోతలు, కూడికలు, తీసివేతల ప్రోగ్రాం కూడా ఏదీ  లేనట్లుంది. ప్రధాన పార్టీల్లోంచి నేతలను ఏరడం ద్వారా కొత్త సీసాలో పాత సారా కలపాలనుకుంటోంది. ఎక్కడికక్కడ టీడీపీ, వైసీపీలకు గురి పెట్టి నాయకులను చేర్చుకోవడంలో  ఆ పార్టీ బిజీగా ఉంది.


వాళ్ళే ఇంపా :


నిజానికి జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ గురించి చెబుతూ కొత్త రక్తం రావాలని పిలుపు ఇచ్చారు. దాంతో చాలా మందికి అవకాశాలు దక్కుతాయని అంతా భావించారు. అప్పట్లో అన్న నందమూరి చేసిన ప్రయోగంలా పవన్ కూడా కొత్త వారిని ప్రోత్సహిస్తారని ఆలొచించారు. తటస్తులు, విద్యావంతులు, రాజకీయాల పట్ల మక్కువ ఉన్న యువత కూడా సంబరపడింది. చూడబొతే ఫిరాయింపు నేతలే మాకు ఇంపు అంటూ జనసేన చెప్పకనే చెబుతోంది.


చేరిన వారంతా వారే :


ముమ్మిడివరం తొలి టికెట్ తీసుకున్న పితాని బాలక్రిష్ణ వైసీపీ నాయకుడు, ఆయన జనసేనలోకి అలా ఫిరాయించగానే టికెట్ ఇచ్చేశారు. ఇదే జిల్లాలో రాపాక ప్రసాదరావు కు కూడా టికెట్ కన్ ఫర్మ్ అంటున్నారు. ఆయనా రాజకీయాల్లో పాత కాపే. అలాగే ఇదే జిల్లాలో నలుగుతున్న అనేక పేర్లు టీడీపీ,వైసీపీ నుంచి బయటకు రాబోతున్న నాయకులే, వారికే టికెట్లు ఇవ్వడానికి జనసేన రెడీ అవుతోంది.


విశాఖ జిల్లా  విషయానికి వస్తే టీడీపీల ఉన్న సుందరపు విజయకుమార్ కి కూడా జనసేన టికెట్ ష్యూర్ అంటున్నారు. అలాగే ఉత్తరాంధ్రాలో పలు చోట్ల వైసీపీ, టీడీపీ టికెట్ రాని వారు జనసేన వైపు చూస్తున్నారు. వారికి కండువాలు కప్పి టికెట్లు ఇచ్చే పనిలో జనసేన రెడీగా ఉంది. మరి కొత్త రకం రాజకీయం అని చెప్పుకుని పాత నాయకులెకే మళ్ళీ టికెట్లు ఇవ్వడం వల్ల ఏం సందేశం పార్టీ ఇవ్వబోతోందన్నది జనాలకు అర్ధం కావడం లేదు. నిజానికి పవన్ కి జనంలో విపరీతమైన ఫాలోయింగు ఉంది. అయన తలచుకుంటే  కొత్త నాయకులను తయారు చేయగలరు, మరి రాజమార్గం  వదిలేసి ఇలా షార్ట్ కట్ మెదడ్స్ ని అనుసరించడం వల్ల ఉపయోగం ఏమైన ఉందా అన్న సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: