విశాఖ‌ప‌ట్నం జిల్లా య‌ల‌మంచిలిలో టీడీపీకి గ‌ట్టి ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించి న సుంద‌ర‌పు విజ‌య‌కుమార్‌.. చంద్ర‌బాబుకు హ్యాండిచ్చారు. దీంతో ఇక్క‌డ టీడీపీకి పెను విఘాతం ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. 2013లో జ‌రిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలోని పలు పంచాయతీల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు వెనుకాడుతున్న తరుణంలో సుంద‌ర‌పు అంద‌రినీ ముందుండి నడిపించారు. అదేవిధంగా ఎలమంచిలి మునిసిపల్‌ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు. అందుకు ప్రతిఫలంగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్‌ ఇస్తామని చెప్పిన చంద్ర‌బాబు ఆయ‌న‌కు హ్యాండిచ్చారు. 


2014 ఎన్నిక‌ల్లో సుంద‌ర‌పు ఇస్తాన‌న్న టికెట్‌ను పంచ‌క‌ర్ల రాంబాబుకు క‌ట్ట‌బెట్టారు చంద్ర‌బాబు. దీంతో తీవ్ర నిరాశ‌కు గురైన విజ‌య‌కుమార్‌... మౌనంగా ఉండిపోయారు. వైసీపీ నుంచి అప్ప‌ట్లో ఆఫ‌ర్లు వ‌చ్చినా పార్టీపై ఉన్న ప్రేమ‌, అధినేత పై ఉన్న మ‌క్కువ‌తోనే ఆయ‌న పార్టీ నుంచి దూరం కాలేదు. అయితే,  ఇప్పుడు మ‌ళ్లీ ఎన్నిక‌ల భేరీ మోగేందుకు వాతావ‌ర‌ణం సిద్ధం అవుతుండ‌డంతో ఇటీవల ఆయ‌న‌ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని అభ్య‌ర్థించారు. అయితే, దీనిపై స్పందించిన లోకేష్ వారంలో న్యాయం చేస్తాన‌ని చెప్పి.. ఇప్ప‌టికీ మౌనం వ‌హించ‌డంతో ఇక‌, త‌న భ‌విష్య‌త్తు అంధ‌కారం కాకూడ‌ద‌నే ఉద్దేశంతో విజ‌య‌కుమార్ జ‌న‌సేనాని ప‌వ‌న్ గూటికి చేరిపోయారు. 


తన విలువ గుర్తించని టీడీపీలో ఉండడం వల్ల ప్రయోజనమేమిటనేది ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌శ్న‌.  పార్టీ అధికారంలోకి వ చ్చి నాలుగున్నరేళ్లయినా తనకు ఎటువంటి న్యాయం చేయని పెద్దలు, ఇప్పుడేం చేస్తారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చే స్తున్నారు.  ఈ క్ర‌మంలోనే తన అభిమానులు, ముఖ్య కార్యకర్తలతో చర్చించి జ‌న‌సేన గూటికి చేరిపోయారు. ఇక‌, సుంద‌ర‌పు వెళ్లిపోవ‌డంతో స్థానికంగా టీడీపీ గ‌ట్టి దెబ్బ‌త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పంచ‌క‌ర్ల రాంబాబుకు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని, ఈ క్ర‌మంలో సుంద‌ర‌పును వాడుకుని ఉంటే సీటు మ‌ళ్లీ టీడీపీ ఖాతాలోనే ప‌డేద‌ని చెబుతున్న‌వారు ఉన్నారు. అయితే, చంద్ర‌బాబు మాత్రం ఈ విష‌యంలో మంత్రి గంటా, అయ్య‌న్న ల స‌ల‌హాలు తీసుకుని ఇలా చేసి ఉంటార‌ని అంటున్నారు. ఏదేమైనా .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి గ‌ట్టి దెబ్బ ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: