ఆకలికి కులం, లేదు, పేదలకు మతం లేదు. అన్ని కులాల్లోనూ బీదవారు ఉంటారు. మరి తాము అందరికీ అన్నీ చేశామని చెప్పుకుంటున్న పాలకులు జనాలు ఇంకా తమను ఆదుకోవాలని ఎక్కడికక్కడ కోరుకోవడం వెనక తమ వైఫల్యాలను గుర్తించడం లేదు. ఉన్నత కులంలో కూడా తమకు జరుగుబాటు లేదన్న వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. పాలిత కులాలు కాదు, పాలక కులాలు సైతం ఆకలి కేకలు పెట్టడం విశేష పరిణామమే. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై సొంత కులం కమ్మలే ఇపుడు యాంటీ అవుతుననరు. తమను ఆదుకోవడం లేదని ఏకంగా యువత సోషల్ మీడీయాలో గొంతెత్తుతోంది.


కమ్మల నినాదం :


ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న కులం, అధికారాన్ని అనేక దశాబ్దాలుగా గుప్పిట పట్టిన కులం, ఇప్పటికీ అధిపత్య కులంగా ముద్ర ఉన్న జాతి వారు సైతం తమను ఆదుకోవాలంటూ చేతులు చాస్తున్నారు. తమ బోటి పేదలను పాలకులు పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. పేరుకు మాత్రమే ఉన్న‌త కులంగా ఉన్నామని, తాము కూడా నిరుపేదలమేనని అంటున్నారు. తమను కూడా సమాదరించాలని కమ్మ కులస్తులు నినదిస్తున్నారు.


అరవై శాతం పేదలు:


కమ్మ కులంలో అరవై శాతం పేదలు ఉన్నారని అంటున్నారు. ఏపీలో ఆరు శాతం ఉన్న తాము ఇప్పటికీ పేదలమేనని చెబుతున్నారు. తమ కులస్తులు బతుకు తెరువు కోసం వ్యవసాయ కూలీలుగా మారిపోయారని కూడా చెబుతున్నారు. ఒకనాడు భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసే తాము అక్కడ దిగుబడి రాక నష్టపోతున్నామని చెబుతున్నారు. అటు ఉపాధి లేక ఇటు వేరే  పని లేక బీదల పాట్లు పడుతున్నామని ఆక్రోశిస్తున్నారు.


మాకో కార్పోరేషన్ :


కమ్మ వారు తమకూ ఓ కార్పోరేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ఓట్లతో గద్దెనెక్కిన టీడీపీ తమను కూడా పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఎటూ తాము టీడీపీకే ఓట్లు వేస్తామన్న నమ్మకంతో మిగిలిన కులాలనే ఆదరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ కులస్తుల పాలన  ఏపీలో ఉన్నా తమకు మాత్రం న్యాయం జరగడంలేదని అంటున్నారు. సొంత కులానికి చేస్తే ఏమైనా అనుకుంటారని బాబు కూడా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. 


బ్రాహ్మణులు, వైశ్యుల మాదిరిగా తమకూ ఓ కార్పోరేషన్ కావాలని గట్టిగా కోరుతున్నారు. ఇందుకోసం త్వరలో విజయవాడ నుంచి సమర నాదం వినిపించేందుకు కమ్మ యువత సిధ్ధమవుతోంది. ఇదిలా ఉండగా కమ్మ యువత ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చేసుకుని తమ నినాదాన్ని అంతటా వినిపిస్తోంది. మరి సొంత కులం వారి వేదనలు, రోదనలు బాబుకు వినిపిస్తాయా. ఏపీకి ఎంతో చేశానని చెబుతున్న ముఖ్యమంత్రి తన కులం ఆకలి కేకలు పెట్టడాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: