పార్టీ శ్రేయ‌స్సు దృష్ట్యా ఒక్కోసారి  క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకోవాల్సుంటుంది. ఆ నిర్ణ‌యాలు నేత‌ల‌కు ఇష్టం ఉన్నా లేక‌పోయినా త‌ప్ప‌దు. గుంటూరు జిల్లాలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న  వ్యూహాత్మ‌క నిర్ణ‌యం కూడా అందులో భాగంగానే క‌నిపిస్తోంది.  గుంటూరు, న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌య‌కర్త‌ల‌ను జ‌గ‌న్ హ‌టాత్తుగా రెండు రోజుల క్రితం మార్చేశారు.  ఈ మార్పుతో అంద‌రూ షాక‌య్యార‌ట‌. కాక‌పోతే జ‌గన్ స్ట్రాట‌జీ తెలుసుకున్న‌వారు మాత్రం ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ట‌. అయితే,  అవి ఎంత వ‌ర‌కూ వ‌ర్క‌వుటుందో తెలీటం లేదు. 


గుంటూరుకు లావు


ఇంత‌కీ విష‌యం ఏమిటంటే, కొంత‌కాలంగా గుంటూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య‌కర్త‌గా లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ ప‌నిచేసుకుంటున్నారు. యువ‌కుడు, స్ధానికుడు కూడా కావ‌టంతో పార్టీలోనే కాకుండా జ‌నాల్లో కూడా బాగానే చొచ్చుకుని పోతున్నారు. ఎటూ ఆర్దికంగా కూడా బాగా స్దితిమంతుడు కావ‌టంతో వ‌న‌రుల‌కు ఇబ్బందిలేదు. ఒక విధంగా  టిడిపి ఎంపి గ‌ల్లా జ‌య‌దేవ్ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్నీ విధాల  ధీటైన అభ్య‌ర్ధి దొరికాడు వైసిపికి అనిపించుకుంటున్నాడు. ఇద్ద‌రు కూడా ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు కావ‌టంతో వ‌చ్చే ఎన్నిక‌లో మంచి పోటీ ఉంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.

న‌ర‌స‌రావుపేట‌లో కిలారు


అదే సమ‌యంలో జిల్లాలోనే మ‌రో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ‌మైన న‌రస‌రావుపేటలో కిలారు వెంక‌ట రోశ‌య్య స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉన్నారు. కిలారు పోయిన ఎన్నిక‌ల్లోనే ఎంపి టిక్కెట్టు ఆశించినా అన్నాబ‌త్తుని శివ‌కుమార్ కు టిక్కెట్టు ద‌క్కింది. స‌రే, టిక్కెట్టు ద‌క్క‌క‌పోయినా పార్టీలోనే ప‌నిచేస్తున్నారు.  కేంద్ర మాజీ మంత్రి, పార్టీలో కీల‌క నేత‌ల్లో ఒక‌రైన ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లుకు కిలారి స్వ‌యానా అల్లుడవుతారు. ఆ అద‌న‌పు అర్హ‌త‌తో వ‌చ్చే  ఎన్నిక‌ల్లో ఎంపి టిక్కెట్టు త‌ప్ప‌ద‌న్న ధీమాతో కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 


కుండ‌మార్పిడి ప‌ద్ద‌తిలో మార్చేశారు

Image result for ys jagan

ఈ నేప‌ధ్యంలోనే జ‌గ‌న్ హటాత్తుగా ఇద్ద‌రినీ కుండ‌మార్పిడి ప‌ద్ద‌తిలో మార్చేశారు. కిలారును గుంటూరు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గాను, లావును న‌ర‌స‌రావుపేట స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గాను ప్ర‌క‌టించారు. ఈ మార్పుతో ముందు చాలామంది ఆశ్చ‌ర్య‌పోయారు. త‌ర్వాత జ‌గ‌న్ స్ట్రాట‌జీ తెలుసుకుని మంచి మార్పిడే అంటూ అభినందిస్తున్నారు. జ‌గ‌న్ చేసిన హ‌టాత్తు మార్పుతో టిడిపి నేత‌లు కూడా నివ్వెర‌పోయార‌ట‌. 

ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట‌వుతుంది ?


జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఎంటంటే, గుంటూరు ప‌రిధిలో క‌మ్మ సామాజిక‌వ‌ర్గంతో పాటు కాపులు కూడా బాగా ఎక్కువ‌గా ఉన్నారు. ప్ర‌స్తుతానికి వైసిపి త‌ర‌పున గుంటూరు లోక్ స‌భ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీల్లో ఎక్క‌డా  బ‌ల‌మైన కాపు నేత‌ల్లేరు. అదే పార్ల‌మెంటుకు ఓ కాపు నేత‌ను దింపితే మొత్తం లోక్ స‌భ అంతా క‌వ‌ర్ చేసిన‌ట్లుంటుంద‌న్న‌ది జ‌గ‌న్ వ్యూహం. అదే స‌మ‌యంలో న‌ర‌స‌రావుపేట‌లో కూడా కాపుల‌తో పాటు క‌మ్మోరు కూడా ఎక్కువే. ఇపుడు న‌ర‌స‌రావుపేట ప‌రిధిలో బ‌ల‌మైన  క‌మ్మ నేత‌లు త‌క్కువే. అందుకే లావును న‌ర‌స‌రావుపేట‌కు మార్చిన‌ట్లు చెబుతున్నారు. జ‌గన్ వ్యూహం గ‌నుక క‌రెక్టుగా వ‌ర్క‌వుటైతే రెండు సీట్ల‌లోను వైసిపి గెలుపు ఖాయమ‌ని పార్టీ నేత‌లంటున్నారు. మ‌రి చూడాలి ఎంత వ‌ర‌రూ వ‌ర్క‌వుట‌వుతుందో. 


మరింత సమాచారం తెలుసుకోండి: