తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలు ఏకంగా చంద్ర‌బాబునాయుడుకే షాకిచ్చారు.  దాదాపు వారం రోజుల పాటు జ‌రిగిన అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల‌కు గైర్హాజ‌ర‌వ్వ‌టం ద్వారా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై త‌మ చిత్త‌శుద్దిని నిరూపించుకున్నారు.  వైసిపి ఎంఎల్ఏలు అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రిస్తే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ని, చిత్త‌శుద్ద‌ని వారిపై విరుచుకుప‌డ్డ చంద్ర‌బాబు ఇపుడు మాత్రం ఏం చేయాలో దిక్కుతోచ‌క ఇబ్బంది ప‌డ్డారు. 


ఇంత‌కీ విష‌యం ఏమిటంటే,  అసెంబ్లీ  వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఎంఎల్ఏల హ‌జ‌రుపై  చంద్ర‌బాబు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.  అధికార పార్టీ ఎంఎల్ఏలై ఉండి కూడా స‌మావేశాల‌కు రాక‌పోతే ఎలా అంటూ నిల‌దీశారు.  అసెంబ్లీ స‌మావేశాల నిర‌వ‌దిక వాయిదా త‌ర్వాత చంద్ర‌బాబు అధ్య‌క్షత‌న శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం జ‌రిగింది. ఆ స‌మావేశంలో  ప‌లువురు ఎంఎల్ఏల‌కు బాగా త‌లంటిపోశారు. ప్ర‌తిప‌క్షం మాదిరిగానే కొన్ని సంద‌ర్భాల్లో ఎంఎల్ఏలు మంత్రుల‌ను నిల‌దీసిన విధానం బాగుంద‌ని కొంద‌రు ఎంఎల్ఏల‌ను ప్ర‌శంసించారు.


అదే సంద‌ర్భంలో ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు స‌భ‌ల‌కు హాజ‌రైన విష‌యంపై మాత్రం మండిప‌డ్డారు. మొత్తం 125  మంది ఎంఎల్ఏల‌కు గాను అన్నీ రోజులు స‌భ‌కు హాజ‌రైంది మాత్రం 88 మంది మాత్ర‌మేన‌ట‌.  ప‌దిమంది ఎంఎల్ఏలైతే హాజ‌రైంది 4 రోజులేన‌ట‌. మ‌రో 19 మంది ఎంఎల్ఏలు 5 రోజులు మాత్ర‌మే హాజ‌ర‌య్యార‌ని చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. చీరాల ఎంఎల్ఏ ఆమంచి కృష్ణ‌మోహ‌న్ అయితే ఒకే ఒక్క‌రోజు హాజ‌ర‌య్యారంటూ చంద్ర‌బాబు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. 167 మంది ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు హాజ‌ర‌వ్వాల్సిన శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశానికి హాజ‌ర‌య్యింది కేవ‌లం 89 మంది మాత్ర‌మే అంటూ చీఫ్ విప్పుల‌ను, విప్పుల‌పై మండిప‌డ్డారు.  అసెంబ్లీ స‌మావేశాల‌కు టిడిఎల్పీ స‌మావేశాల‌కు హాజ‌రయ్యే ఓపికి కూడా ప్ర‌జాప్ర‌తినిధుల‌కు లేక‌పోతే ఎలాగంటూ చుర‌క‌లంటించారు. మొత్తం మీద సగంమంది ఎంఎల్ఏ, ఎంఎల్సీలు గైర్హాజ‌ర‌వ్వ‌టం ద్వారా  చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చార‌నే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: