తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌, విపక్ష కాంగ్రెస్‌ కూటమి మధ్య హోరాహోరి పోరు తప్పేలాలేదు. టీఆర్‌ఎస్‌ను ఎదురుకునేందుకు కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, తెలంగాణ మహాజనసమితితో మహాకూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉంది. దీంతో ఇక్కడ బిగ్‌ ఫైట్‌ తప్పేలాలేదు. పలు నియోజకవర్గాల్లో హేమా హేమీలు రంగంలో ఉన్నారు. దీంతో ఆ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి సహజంగానే అందరిలోను ఉంది. అయితే నల్గొండ జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గంలో ఇద్దరు ఉద్దండపిండులైన రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. దీంతో ఇప్పుడు తెలంగాణలో అందరి చూపు ఆ నియోజకవర్గం మీదే ఉంది. 


ఈ నియోజకవర్గంలో ఆ ఇద్దరూ ఉద్దండపిండులలో ఎవరు గెలుస్తారు? వీరి మధ్య పోరు ఎలా ఉంటుంది ? ఫైన‌ల్‌గా ఎవరు పైచేయి సాధిస్తారు... అన్న చర్చలు ప్రారంభమైయ్యాయి.ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో కాదు మిర్యాలగూడ. నాగార్జునసాగర్‌ తాజా మాజీ ఎమ్మెల్యే జానా రెడ్డి, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మిర్యాలగూడ నుంచి పోటీ చేసేందుకు దాదాపు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అసలు మేటర్‌లోకి వెళ్తే గత ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆప‌రేషన్‌ ఆకర్ష్‌ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసేశారు. అయితే తాజా ఎన్నికల్లో ఆయన కోదాడ నుంచి పోటీ చెయ్యాలని భావించారు. అయితే నిన్నటి వరకు నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానా రెడ్డి ఇప్పుడు మిర్యాలగూడ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


మిర్యాలగూడలో జానారెడ్డి తన శిష్యుడు నల్లమోతు భాస్కర్‌రావుకు గత ఎన్నికల్లో సీటు ఇప్పించుకున్నారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన భాస్కర్‌రావు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి జంప్‌ చేసేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ ప్రకటించిన 105మంది అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. తన కుమారుడు పొలిటికల్‌ ఎంట్రీ కోసం కష్టపడుతున్న జానా రెడ్డి తన నాగార్జునసాగర్‌ను వారసుడు రఘువీర్‌ రెడ్డికి ఇచ్చి ఆయన ఇప్పుడు మిర్యాలగూడ బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తే తాను సులువుగా విజయం సాధిస్తానని నాగార్జునసాగార్‌లో తన కుమారుడు రఘువీర్‌ రెడ్డి గెలుపు సులువు అవుతుందన్న లెక్కల్లో ఆయన ఉన్నారు. 


మిర్యాలగూడ నుంచి తన రాజకీయ గురువు జానారెడ్డి రంగంలోకి దిగుతుండడంతో తన గురువుపై పోటీ చేసేందుకు మిర్యాలగూడ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. మిర్యాలగూడ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా భాస్కర్‌రావు తప్పుకుంటే అక్కడ నుంచి జానా రెడ్డిపై గుత్తా సుఖేందర్‌ రెడ్డిని పోటీ చేయించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. జానా రెడ్డిలాంటి సీనియర్‌ను ఎదుర్కోవాలంటే గుత్తా సుఖేందర్‌ రెడ్డి లాంటి బలమైన నేతే క‌రెక్ట్ అన్న అభిప్రాయంలో కేసీఆర్‌ ఉన్నారు. వాస్తవంగా కోదాడ లేదా హుజూర్‌నగర్‌ నుంచి పోటీ చెయ్యాలని ముందు నుంచి భావించిన గుత్తా ఇప్పుడు అనుకోకుండా మిర్యాలగూడ నుంచి బరిలోకి దిగడం తప్పని సరిగా కనిపిస్తోంది. ఏదేమైన కేసీఆర్‌ తొలి సారి ప్రకటించిన 105మంది అభ్యర్థుల జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు అనివార్యంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: