హైదరాబాదీలు ఎన్నాళ్లగానో వేచి చూస్తున్న ఉదయం వచ్చింది. ఎల్బీ నగర్ - అమీర్ పేట్ మెట్రోకు పరుగుకు రంగం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటలకు లాంఛనంగా పరుగులు పెట్టనుంది.  తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, పచ్చజెండా ఊపి మెట్రోను ప్రారంభించనుండగా, అనంతరం 3 గంటల సమయంలో ప్రయాణికులతో తొలి రైలు ఎల్బీ నగర్ బయలుదేరుతుంది. ఇప్పటికే మియాపూర్ నుంచి నాగోల్ వరకూ మెట్రో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

Image result for narasimhan governor

వాస్తవానికి ఈ ఏడాది జూన్ మొదటివారంలోనే మియాపూర్ - ఎల్బీ నగర్ మెట్రో అందుబాటులోకి వస్తుందని అందరూ అంచనా వేశారు. మెట్రోరైల్ భద్రతా కమిషనర్ (సీఎంఆర్ఎస్) నుంచి అనుమతులు లభించకపోవడంతో అది కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మొత్తం 29 కిలోమీటర్ల దూరం. అందులో 13 కిలోమీటర్లు మియాపూర్ నుంచి అమీర్ పేట వరకు గత ఏడాది నవంబర్‌లోనే అందుబాటులోకి వచ్చింది. అప్పుడు ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రోను ప్రారంభించారు.


ఇప్పుడు మిగిలిన 16 కిలోమీటర్ల మార్గంలో మెట్రోను గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారు. ఈ మార్గంలో మొత్తం 17 స్టేషన్లు ఉండగా, ఎల్బీ నగర్ లో బయలుదేరే వ్యక్తి, మియాపూర్ కు 52 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రతి ఐదు నిమిషాలకూ ఓ రైలు ఉంటుందని, ఇవి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అధికారులు తెలిపారు.  కాగా, ఈ మార్గంలో కేవలం ఎల్బీ నగర్, మూసారంబాగ్, ఎర్రమంజిల్, పంజాగుట్ట స్టేషన్ల వద్ద మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: