మావోయిస్టుల చేతిలో అత్యంత దారుణంగా బలైపోయిన అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. గిరిజ‌నుల కోసం, గిరిజ‌న హ‌క్కుల కోసం అనునిత్యం ప‌రిత‌పించేవాడిగా స‌ర్వేశ్వ‌ర‌రావుకు 2014 వ‌ర‌కు మంచి పేరుంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో అప్ప‌టి ఎమ్మెల్యే, టీడీపీ నేత‌, ప్ర‌స్తుతం కిడారితో పాటు తాజాగా మృతి చెందిన అర‌కు మాజీ ఎమ్మెల్యే సివేరీ సోమ‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఆయ‌నను గిరిజ‌న వ్య‌తిరేకిగా ముద్ర వేశారు. అంతేకాదు, అత్యంత వివాదాస్ప‌ద ప్రాంతాల్లో కూడా ఆయ‌న కాలిబాట‌న పర్య‌టించి ప్ర‌చారం చేశారు. దీంతో ఆయ‌న‌ను అంద‌రూ గిరిజ‌న దేవుడిగానే పేర్కొన్నారు.ఈ క్ర‌మంలోనే 2014 ఎన్నిక‌ల్లో దాదాపు 35 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిపించారు. 


అంతాబాగానే ఉంది. కానీ, 2016 ప్రారంభంలో ఆయ‌న టీడీపీతో చేతులు క‌ల‌ప‌డం.. అప్ప‌టి వ‌రకు ఆయ‌న ఎవ‌రిపైనైతే.. ఆరోప‌ణ‌లు చేస్తున్నారో మాజీ ఎమ్మెల్యే సోమ‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం వంటి ప‌రిణామాలు తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. వీటికితోడు సంయుక్తంగా ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు గ‌నుల త‌వ్వ‌కాల‌ను చేస్తున్నారు. దీనికి అధికార టీడీపీ కూడా వ‌త్తాసు ప‌ల‌క‌డంతో  పైకి గ‌నుల త‌వ్వ‌కాలు లేవంటూనే టీడీపీ ప్ర‌భుత్వం వీరికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించింద‌నే వ్యాఖ్య‌లు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. పోలీసులు సైతం ఈ విష‌యంలో స్పంద‌న అంతంత మాత్రంగానే క‌న‌బ‌రిచార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 


ఏదేమైనా.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హ‌త్య దారుణ‌మ‌నేది  వాస్త‌వం. కానీ, దీని వెనుక గిరిజ‌నులకు అన్యాయం జ‌రిగింద‌ని మావోయిస్టులు చెబుతున్న‌ట్టుగా వార్త‌లు రావ‌డం గ‌మ‌నార్హం. తాము క్వారీని మూసివేయాల‌ని కోరామ‌ని, కానీ, కిడారి మాత్రం త‌న మానాన త‌ను వ్య‌వ‌హ‌రించార‌నేది మావోయిస్టుల మాట‌గా ఉంది. మ‌రి ఈ వ్యాఖ్య‌లను, మావోయిస్టుల చ‌ర్య‌లు ప‌రిశీలిస్తే.. కిడారి చేసింది గిరిజ‌న ద్రోహ‌మేనా?  దాదాపు రెండు నెల‌లుగా ఇక్క‌డ గ‌నుల‌కు వ్య‌తిరేకంగా నిర్వ‌హి స్తున్న ఆందోళ‌న‌ను  తీవ్ర‌త‌రం చేసినా.. ఎమ్మెల్యేగా ఆయ‌న ప‌ట్టించుకోక‌పోవ‌డం మ‌రింత వివాదానికి తావిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని సంపాద‌న‌పైనే దృష్టి పెట్టిన కిడారి.. గిరిజ‌నుల హ‌క్కుల‌ను కాల‌రాచాడ‌నేది మావోయిస్టుల వాద‌న‌. ఇక‌, ఎవ‌రెన్ని విధాల ఎన్ని ప్ర‌క‌టన‌లు చేసినా.. వాస్త‌వ రూపం మాత్రం గిరిజ‌నుల వ్య‌తిరేక‌త కొంప‌ముంచింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు!!  


మరింత సమాచారం తెలుసుకోండి: