అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావును మావోయిస్టులు కాల్చి చంపిన ఘ‌ట‌న రెండు తెలుగు రాష్ట్రాలను చివురు టాకులా వ‌ణికింప జేసింది. అయితే, ఈ విషాదాంతం వెనుక ఉన్న నిజాలు ఏంట‌నేది ప‌క్క‌న పెడితే.. ఆయ‌న ఒక పార్టీపై గెలిచి.. మ‌రో పార్టీలోకి చేర‌డ‌మే ఆయ‌న ప్రాణాల మీద‌కు తెచ్చింద‌నే వ్యాఖ్య‌లు వినిస్తున్నాయి. అయితే, రాష్ట్రంలోని దాదాపు 23 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు ఇలానే పార్టీ మారిన నేప‌థ్యంలో అంద‌రినీ మావోయిస్టులు కాల్చి చంపుతారా? అంటే.. కాదు! కానీ, ఒక్క కిడారి విష‌యంలో ప్ర‌త్యేక‌త ఉంది. ఆయ‌న అత్యంత కీల‌క‌మైన గిరిజ‌న ప్రాంతానికి ప్ర‌జాప్ర‌తినిధిగా ఉన్నాడు. అంతేకాదు, 2014 వ‌ర‌కు గిరిజ‌న హ‌క్కుల కోసం, గిరిజ‌నులకు జ‌రుగుతున్న అన్యాయాల మీద తిరుగులేని పోరాటం చేశారు. 


అప్ప‌ట్లో ఎమ్మెల్యేగా ఉన్న సివేరీ సోమ‌కు వ్య‌తిరేకంగా అనేక ఉద్య‌మాలు చేశారు. ప్ర‌తి గిరిజ‌న గూడేనికి వెళ్లి వారి వారి హ‌క్కుల‌ను తెలియ‌జేశారు. వారికి జ‌రుగుతున్న అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ క్ర‌మంలోనే అనూహ్య‌మైన మెజారిటీతో 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లోఆయ‌న వైసీపీ టికెట్‌పై గెలుపొందారు. అయితే, ఆయ‌న ఏ గిరిజ‌న హ‌క్కుల కోసం పోరాడాడో? ఏ గిరిజ‌నులకు జ‌రుగుతున్న అన్యాయాల‌పై ఉద్య‌మాలు చేశాడో?  వాట‌న్నింటినీ వ‌దిలేసి.. త‌న వ్యాపారాల కోసం, త‌న ల‌బ్ధి కోసం, డ‌బ్బు కోసం పార్టీ మారిపోయాడు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరేందుకు దాదాపు రూ.50 కోట్ల వ‌ర‌కు ఆయ‌న తీసుకున్నాడ‌నేది మావోయిస్టులు చెబుతున్న స‌మాచారాన్ని బ‌ట్టి వెలుగు చూసింది. 


అదేస‌మ‌యంలో గిరిజ‌నులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న న‌ల్ల‌రాయి గ‌నులను ఆయ‌నే కొన‌సాగిస్తుండ‌డంతో ఆయ‌న మావోయిస్టుల హిట్ లిస్ట్‌లోకి చేరిపోయారు. మ‌రి గిరిజ‌నులు టీడీపీ అభ్య‌ర్థి సోమ‌ను కాద‌ని, వైసీపీని గెలిపించిన నేప‌థ్యంలో గిరిజ‌నుల‌తో అత్యంత స‌న్నిహిత సంబంధాలున్న మావోయిస్టులు సైతం దీనిని స‌హించ‌లేక‌పోయార‌నే వార్త‌లు తాజాగా వెలుగు చూస్తున్నాయి. బాక్సౌట్ త‌వ్వ‌కాలు, గ‌నుల నిర్వ‌హ‌ణ వంటి కీల‌క వ్యాపారాల‌ను కాపాడుకోవ‌డం కోస‌మే కిడారి అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నాడ నేది మావోయిస్టుల ప్ర‌గాఢ విశ్వాసం. ఇక‌, ఈ క్ర‌మంలోనే గిరిజ‌నులు వ‌ద్దంటున్న గ‌నుల త‌వ్వ‌కాల‌ను ఆయ‌న సాగిస్తూనే ఉన్నారు. గ‌త రెండు మాసాల కాలంలో కిడారికి మావోయిస్టుల నుంచి నాలుగు సార్లు ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు వ‌చ్చినా.. ఆయ‌న లెక్క‌చేయ‌లేద‌నేది మ‌రో వాద‌న‌.  


వెర‌సి.. వైసీపీని వీడి త‌న వ్యాపారాలు, ఆర్థిక బ‌లోపేతం కోసం కిడారి పార్టీ మార‌డంపై మావోయిస్టులు, గిరిజ‌నుల్లోని కొన్ని వ‌ర్గాలు సైతం స‌హించ‌లేక‌పోయాయి. దీంతోనే కిడారికి వ్య‌తిరేకంగా ప‌క్కా స్కెచ్‌తో మావోయిస్టులు వ్య‌వ‌హ‌రించారు. అటు అధికార పార్టీ నేత‌ల ఆగ‌డాలు తాళ‌లేక వీళ్ల‌ను గెలిపిస్తే.. వీళ్లు మ‌ళ్లీ వెళ్లి అధికార పార్టీతో పొత్తు పెట్టుకుంటే వీరిని కాపాడేది ఎవ‌రు? ఇప్పుడు ఇదే రీజ‌న్ కిడారి ప్రాణాల‌ను తీసింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇదే కిడారి వైసీపీలోనే ఉండి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌నే వాద‌న గ‌ట్టిగా వినిపిస్తోంది. ఏదేమైనా.. పార్టీ మారి కిడారి ప్రాణాలు పోగొట్టుకున్నాడ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: