ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కొండా దంప‌తులు రాజ‌కీయ నిర్ణ‌యంపై ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. టీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతారా..? అంత‌ర్గ‌తంగా కేసీఆర్‌తో ఏమైనా రాజీ కుదిర్చుకున్నారా..?  లేక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా..?  చివ‌రికి దారి తోచ‌ని స్థితిలో ప‌డిపోయారా..? అన్న‌కోణంలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నెల 23న త‌మ రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని, బ‌హిరంగ లేఖ విడుద‌ల చేస్తామ‌ని చెప్పిన కొండా దంప‌తులు ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు. దీంతో వారి నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతున్న‌ద‌న్న దానిపై ఎవ‌రికి వారు అనేక ఊహాగానాలు చేస్తున్నారు. నిజానికి వారు తీసుకునే నిర్ణ‌యం మూడు నుంచి నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్నాయి. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కుల్లోనూ టెన్ష‌న్ మొద‌లైంది.

Image result for TELANGANA

ఈనెల 6న కేసీఆర్ అసెంబ్లీని ర‌ద్దు చేసి ఏకంగా 105మంది పార్టీ అభ్య‌ర్థులను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇందులో వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు లేదు. దీంతో షాక్‌కు గురైన కొండా సురేఖ రెండు రోజుల త‌ర్వాత ఏకంగా హైద‌రాబాద్లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ రోజు మీడియా స‌మావేశంలోనే ఇక తాము టీఆర్ఎస్లో కొన‌సాగ‌లేమ‌ని తేల్చి చెప్పారు. ఈనెల 23న త‌మ నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. ఇన్ని రోజులు గ‌ణేశ్ రాత్రుల సంద‌ర్భంగా కొండా దంప‌తులు సెంటిమెంట్ రీత్యా బ‌య‌ట‌కు రాలేదు. కానీ.. న‌వ‌రాత్రులు ముగిసిన త‌ర్వాత కూడా వారు మీడియా ముందుకు రాక‌పోవ‌డంతో ఏం చేయ‌బోతున్నార‌న్నది అంద‌రిలో ఉత్కంఠ రేపుతోంది. 


అయితే..ఈ క్ర‌మంలోనే మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన టాక్ వినిపించింది. కేసీఆర్ మాట్లాడార‌నీ.. ఇక కొండా సురేఖ టీఆర్ఎస్లోనే కొన‌సాగుతార‌నీ.. ఆమెకే వ‌రంగ‌ల్ తూర్పు టికెట్ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇందులో నిజం లేద‌నే వాద‌న కూడా మొద‌లైంది. ఇదంతా కూడా కొండా ముర‌ళి మైండ్‌గేమ‌ని ప‌లువురు అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా వారికి ఒకే ఒక్క టికెట్ ఇచ్చేందుకు పార్టీ సానుకూలంగా ఉండ‌డంతో వారు వెన‌క‌డుగు వేసిన‌ట్లు తెలుస్తోంది. ఇటు టీఆర్ఎస్‌లో కొన‌సాగ‌లేక అటు కాంగ్రెస్‌పార్టీలోకి వెళ్ల‌లేక వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. పూర్తి స్థాయిలో లేఖ త‌యారు కాక‌పోవ‌డం వ‌ల్లే ఈ ఆల‌స్యం జ‌రుగుతోంద‌నే టాక్ కూడా వినిపిస్తోంది. లేఖ‌లో ఏఏ అంశాలు ఉండాల‌న్న దానిపై పూర్తిస్థాయిలో క‌స‌ర‌త్తు చేసిన త‌ర్వాతే మీడియా ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: