మావోలు లేరు అనుకుని ధీమాగా తిరిగిన రోజులు మళ్ళీ పోయాయి. ఏకంగా నడి రోడ్డు మీదనే మిట్ట మధ్యాహ్నం అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అయిన కిడారి సర్వేశ్వరరావునే దారుణంగా హత్య చేయగలిగారంటే మావోల పట్టు ఏంటన్నది వెల్లడైంది. ఈ ఆపరేషన్ తరువాత మావోల హిట్ లిస్ట్ అంటూ ఒకటి బయటకు వచ్చింది. దాంతో విశాఖ జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.


అయ్యన్న అలెర్ట్ :


విశాఖ జిల్లాలో సీనియర్ మంత్రిగా ఉన్నా అయ్యన్నపాత్రుడు మావోల హిట్ లిస్ట్ లో ఉన్నట్లుగా పోలీసు వర్గాల సమాచారం. ఇప్పటికే బులెట్ ప్రూవ్ వాహనంలో తిరుగుతున్న అయ్యన్నకు మరింత భద్రత కల్పిస్తూ మారు మూల ప్రాంతాలకు అసలు పోవద్దని  పోలీసులు అప్రమత్తం చేశారు. అయ్యన్న సోదరుడు శ్రీనును గతంలో మావోలు చంపేశారు. అయ్యన్న కుమారుడికి కూడా వార్నింగులు ఇచ్చారన్న ప్రచారమూ ఉంది. దాంతో మొత్తం అయ్యన్న కుటుంబం విషయంలో పోలీసుకు ఇపుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


ఆమెకూ ముప్పేనా :


ఇక వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి కూడా మావోల ముప్పు పొంచి ఉందని ఇంటలిజెన్సె అధికారులు చెబుతున్నారు.  కిడారి హత్యతో ఈశ్వరికి కూడా భద్రత పెంచారు. ఆమెను సైతం సమాచారం ఇవ్వకుండా ఎక్కడికి తిరగొద్దంటూ హెచ్చరించినట్లు భోగట్టా. అలాగే,  అధికార పార్టీలోని కొంతమని ఇతర ప్రముఖులపైనా మావోల కన్ను ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.


మాజీ మంత్రి కూడా :


దాదాపు పాతికేళ్ళ క్రితం మావోలు కిడ్నాప్ చేసి వారం తరువాత విడిచిపెట్టిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పసుపులేటి బాలరాజు కూడా మావోల నుంచి ప్రాణ హాని ఉన్నట్లుగా పోలీస్ వర్గాల సమాచారం. ఆయనను కూడా వారు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. మరో మారు పాడేరు ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకుంటున్న బాలరాజు మంత్రిగా ఉన్న టైంలోనే మావోల నుంచి ప్రమాదం ఉందని తమ మకాంని విశాఖకు మార్చేసుకున్నారు.
మొత్తానికి చూసుకుంటే మావోల హిట్ లిస్ట్ లో అధికార, ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా దాదాపుగా 200 మంది వరకు ఉన్నారని తేలుతోంది. దీంతో నాయకులను రక్షించడం పోలీసుకలు సవాల్ గా మారుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: