న‌ల్ల‌గొండ‌.. కాంగ్రెస్ పార్టీ కంచుకోట‌. కాక‌లు తీరిన సీనియ‌ర్లు.. భ‌విష్య‌త్‌లో పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని భావిస్తున్న నాయ‌కులు.. త‌మ ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి చ‌క్రం తిప్పాల‌నే ఆలోచ‌న‌లో ఉన్ననేత‌లందరూ ఇక్క‌డి నుంచే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని టీఆర్ఎస్‌ రోజురోజుకూ ముమ్మ‌రం చేస్తుంటే.. ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఇంకా స‌మాయ‌త్త‌మ‌వలేదు. టీఆర్ఎస్ నాయ‌కులు జోరు పెంచి నియోజక‌వ‌ర్గాల్లో తిరుగుతూ ఉంటే.. ప్ర‌తిప‌క్షాలు మాత్రం మ‌హాకూట‌మి లెక్క‌లు వేస్తున్నాయి. త‌మ‌కు ఇన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని కూట‌మిలోని పార్టీల‌న్నీ కాంగ్రెస్ ముందు త‌మ డిమాండ్లు ఉంచుతు న్నాయి. ఈ లెక్క‌ల‌తోనే స‌త‌మ‌త‌మ‌వుతున్న కాంగ్రెస్ పెద్ద‌ల‌కు.. ఇప్పుడు సొంత పార్టీ నేత‌లు కూడా త‌ల‌నొప్పిగా మారారు. ముఖ్యంగా న‌ల్ల‌గొండ నుంచి ఒక్కో రాజ‌కీయ నాయ‌కుడు.. ఫ్యామిలీ ప్యాకేజీలో భాగంగా రెండేసి సీట్లు అడుగుతుండ‌టంతో స‌ర్దుబాటు ఎలా చేయాలా అని నేత‌లు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. ఒక‌ప‌క్క కూట‌మిలోని పార్టీల సీట్ల లెక్క తేల్చేందుకే తంటాలు ప‌డుతుంటే.. ఈ సీట్ల గోల ఏమిటా అని అధిష్టాన పెద్ద‌లు ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. 


టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, ఆయ‌న స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి సోద‌రులు, జానారెడ్డి, ఆయ‌న త‌న‌యుడు రఘువీర్‌రెడ్డి.. ఇలా అంద‌రూ ఉద్ధండులే.. అంతా న‌ల్ల‌గొండ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారే! వీరితో పాటు మిగిలిన నాయ‌కులు! టీపీసీసీలో జిల్లా నాయకులే ముఖ్య పాత్ర పోషిస్తుండడం, అంతా నాలుగు అంతకంటే ఎక్కువ సార్లు ఎన్నికల్లో విజయాలు సాధించిన సీనియర్లు కావడం, ఒక్కో నాయకుడి కనుసన్నల్లో రెండు మూడు నియోజకవర్గాలు ఉండడం వంటి అంశాలు పార్టీ నాయకత్వానికి ప్రతిబంధకంగా మారిందన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ముందునుంచీ పీసీసీ రేసులో ఉన్నకోమటిరెడ్డి సోదరులకు ఆ పదవి లభించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో తమకున్న ఫాలోయింగ్‌ను పరిగణనలోకి తీసుకుని పీసీసీలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని భువనగిరి, మునుగోడు, నల్లగొండ, నకిరేకల్‌ నియోజకవర్గాల బాధ్యత తమకే అప్పజెప్పాలని, తాము చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్‌ పెట్టారని సమాచారం. 


నల్లగొండ, నకిరేకల్‌ వెంకట్‌రెడ్డి బాధ్యతగా, మునుగోడు, భువనగిరి రాజగోపాల్‌రెడ్డి బాధ్యతగా నిర్ణ‌యించారు. అంతా సర్దుకుంటుందన్న సమయంలో టీపీసీసీ ఎన్నికల కమిటీలు చిచ్చురేపాయి. తమకు ప్రాధాన్యం దక్కకపోవడంపై రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా నిరసించారు. ఇక, వీరి కోటాలో దక్కనున్న భువనగిరిలో అన్నీ సవ్యంగా జరిగితే జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి జిల్లాలో కాంగ్రెస్‌ నేతల నాలుగు కుటుంబాల నుంచి ఎనిమిది సీట్లు ఆశిస్తున్నారని అంటున్నారు. కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు, జానారెడ్డి, ఆయన తనయుడు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన సతీమణి, రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి ఆయన తనయుడు, ఇలా ఒక్కో కుటుంబంలో రెండేసి టికెట్లు ఆశిస్తున్నారని చెబుతున్నారు. 


పీసీసీ చీఫ్‌ ఉత్తమ్, ఆయన సతీమణి ఉత్తమ్‌ పద్మావతి ఇప్పటికే సిట్టింగులు కాబట్టి కోదాడ, హుజూర్‌నగర్‌లు తమకే దక్కాల్సి ఉందంటు న్నారు. జానారెడ్డి ఈసారి మిర్యాలగూడ వచ్చి, నాగార్జునసాగర్‌లో తన తనయుడు రఘువీర్‌రెడ్డి బరిలోకి దింపాలనుకుంటున్నార‌ట‌. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, తన తనయుడు సర్వోత్తమ్‌రెడ్డికి భువనగిరి కావాలని అడుతున్నారని చెబుతున్నారు. అంతకు కావాల్సి వస్తే తాను పార్లమెంటుకు పోటీ చేయడానికి సిద్ధమన్న సంకేతాలు కూడా పంపారట‌. జానారెడ్డి కూడా అదే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. మొత్తానికి ఒక జిల్లాలో నలుగురు కాంగ్రెస్‌ సీనియర్లు రెండేసి సీట్లు కావాలనుకుంటున్నారని పేర్కొంటున్నారు. మ‌రి అభ్య‌ర్థుల ఎంపిక క‌త్తి మీద సామేన‌ని అర్థ‌మయ్యే ఉంటుంది. మ‌రోపక్క మ‌హాకూట‌మిలోని ఇత‌ర పార్టీలు ఎన్ని సీట్లు కోర‌తాయో ఏమో!! 


మరింత సమాచారం తెలుసుకోండి: