తెలంగాణా రాష్ట్ర స‌మితి తిరుగుబాటు నేత  కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు ఉద‌యం ఏఐసిసి అధ్య‌క్షుడు రాహూల్ గాంధి స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. టిఆర్ఎస్ లో కొండా  సురేఖ‌కు టిక్కెట్టు ఇవ్వ‌ని కార‌ణంగానే  కెసిఆర్ పై కొండా దంప‌తులు తిరుగుబాటు చేశారు. తాజా మాజీ ఎంఎల్ఏ సురేఖ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని వ‌రంగ‌ల్ తూర్పు నియెజ‌క‌వ‌ర్గం నుండి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. 


ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతున్న కెసిఆర్ 105 మందితో అభ్య‌ర్ధుల  మొద‌టి జాబితాను విడుద‌ల  చేశారు. అందులో కొండా పేరు లేదు. అదే విష‌యాన్ని కెసిఆర్ తో ప్ర‌స్తావిస్తే స‌మాధానం లేదు. దాంతో వారికి అర్ధ‌మైపోయింది త‌మ‌కు టిక్కెట్టు రాద‌ని. దాంతో బ‌హిరంగంగానే కెసిర్ పై సురేఖ ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌తో యుద్ధం ప్ర‌క‌టించారు. దాంతో అంద‌ద‌రికీ అర్ధ‌మైపోయింది సురేఖ దంప‌తులు ఇక టిఆర్ఎస్ లో ఉండ‌లేర‌ని. అదే స‌మ‌యంలో వారికి ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ త‌ప్ప వేరే దారీలేదు. 


కాక‌పోతే సురేఖ దంప‌తుల విష‌యంలో ఒక పిత‌లాట‌కం ఉంటుంది. అదేమిటంటే,  త‌న‌కు ఒక్క‌దానికే టిక్కెట్టు కాకుండా త‌న భ‌ర్త కొండా ముర‌ళీధ‌ర రావుకు కూడా టిక్కెట్టు కోసం ప‌ట్టుప‌డుతుంటారు. కాంగ్రెస్ లో ఉన్న‌పుడూ అంతే తాజాగా  టిఆర్ఎస్ లోను అదే జ‌రిగింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికితోడు సురేఖ పై ఆరోప‌ణ‌లు రావ‌టంతోనే కెసిఆర్ టిక్కెట్టు ఇవ్వ‌లేద‌ని స‌మాచారం.


స‌రే, విష‌యం ఏదైనా వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంతో పాటు భూపాల‌ప‌ల్లి, ప‌ర‌కాల‌, వ‌రంగ‌ల్ వెస్ట్ నియోజ‌క‌వర్గాల్లో
కొండా దంప‌తుల‌కు మంచి ప‌ట్టుంద‌ని చెబుతుంటారు. అందుకే త‌మ‌కు రెండు టిక్కెట్లు ఇవ్వాల‌ని ఇపుడు కూడా సురేఖ కాంగ్రెస్ అధిష్టానాన్ని గ‌ట్టిగా కోరుతున్నారు. రాహూల్ నిర్ణ‌యం ఎలాగుంటుందో చూడాలి. ఏదేమైనా కొండా దంప‌తులు  కాంగ్రెస్ లో  చేర‌టంతో  పార్టీకి లాభ‌మే త‌ప్ప న‌ష్టం లేద‌నేది నేత‌ల మాట‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: