తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కి పోతున్నాయి.  ముఖ్యంగా టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మద్య మాటల యుద్దం జోరుగా కొనసాగుతుంది.  ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ సీనియర్ నేతలను టార్గెట్ చేస్తుందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే రేవంత్ రెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు దాడులకు దిగారు. హైదరాబాద్‌తో పాటు కొడంగల్‌లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 


ఢిల్లీ నుంచి వారం రోజుల క్రితమే ఇన్‌క‌మ్‌ట్యాక్స్‌ (ఐటి) ప్రతినిధి బృందం హైదరాబాద్ వచ్చింది. అప్పుడే వచ్చి డీజీపీకి రిపోర్ట్ చేసింది. రేవంత్ రెడ్డి ఆస్తులపైన ఐటి దాడులు చేయబోతున్నట్టు స్టేట్ డీజీపీకి సమాచారం ఇచ్చింది. ఏ క్షణంలోనైనా రేవంత్ ఇంటిపై దాడులు జరుగుతాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతూ వస్తుంది. అయితే కుటుంబ సభ్యులతో కలిసి నిన్న తిరుపతి దర్శనానికి వెళ్లారు రేవంత్. అక్కడి నుండి డైరెక్ట్ గా కొడంగల్ వెళ్లారు. ఈరోజు కొడంగల్ లో ప్రచారం చేయనున్నారు రేవంత్.


ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో జూబ్లీ హిల్స్ లోని రేవంత్ ఇంటిపై 15 మంది ఐటి అధికారుల బృందం దాడులు జరుపుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్ రేవంత్ నివాసంలో కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. అందరూ కొడంగల్ లో ఉన్నారు. కొడంగల్ లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.  అప్పట్లో రేవంత్ రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయమై జరుపుతున్న విచారణలో భాగంగానే దాడులు చేస్తున్నట్టు సమాచారం.


ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డిపై హఠాత్తుగా ఏకంగా ఐటీ దాడులకు దిగడం చర్చనీయాంశమైంది. దాడుల్లో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ దాడులతో కాంగ్రెస్ నేతలతో పాటు.. టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు.తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు నేపథ్యంలో ఓటుకు నోటు కేసును మరోసారి తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: