ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాల‌తో మంచి జోష్‌పై ఉన్న టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌. అయితే, ఆయ‌న వ్య‌వ‌హార శైలి తీవ్ర వివాదానికి కార‌ణ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే రెండు మూడు సార్లు సాక్షాత్తూ చంద్ర‌బాబు ఆయ‌న‌ను అమ‌రావ తికి పిలిపించి మ‌రీ ప‌లు విష‌యాల‌పై హెచ్చ‌రించారు. అయినా కూడా చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వ్య‌వ‌హార శైలిలో ఏ మాత్ర‌మూ మార్పు రాలేదు. పైగా రోజు రోజుకు ఆయ‌న తీవ్ర వివాదానికే కార‌ణ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా మ‌ళ్లీ అధికారుల‌పైనా ఆయ‌న చిందులు తొక్కారు. దీనిపై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా విమ‌ర్శ‌లు గుప్పించారు. తాను గాలి రౌడీలు, ఆకు రౌడీలకు భయపడే వ్యక్తిని కాదని.. ఒక్క సైగ చేస్తే కాళ్ళు విరగ్గొట్టి కూర్చోబెడతారంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. 


16 ఏళ్ల వయసులోనే ఆకు రౌడీలు, గాలి రౌడీలను తన్ని తగలేశా.. ఖబడ్దార్ చింతమనేని అంటూ హెచ్చరించారు. దెందులూరులో బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. 27 కేసులున్న వ్యక్తిని విప్‌గా ఎలా నియమించారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులను వెనుకేసుకొస్తున్న టీడీపీకి తానెందుకు అండగా ఉండాలన్నారు. ప్రభాకర్ లాంటి వ్యక్తి సింగపూర్‌లో ఉంటే కర్రతో కొడతారని.. సౌదీ అరేబియాలో అయితే తల తీసేస్తారని ఘాటుగా విమర్శించారు. సింగపూర్ లాంటి రాజధాని కావాలంటే... సింగపూర్ లాంటి పరిపాలన కావాలన్నారు. ప్రజలకు అమోదయోగ్యమైన పరిపాలన ఉంటే భరిస్తారు... లేకపోతే తన్ని తరిమేస్తారని పవన్ చెప్పారు. ఆడపిల్లలను, మహిళలను బూతులు తిడితే చూస్తూ ఊరుకోమన్నారు. 


చింతమనేని అంటే చంద్రబాబు, లోకేశ్‌కు భయం ఉండొచ్చని పవన్ అన్నారు. చింతమనేనిపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏం జరిగినా తమకు బాధ్యత లేదన్నారు. నేరస్తులను చట్టసభలకు పోటీ చేయకుండా నిరోధించడంలో సుప్రీంకోర్టు కూడా చేతులెత్తేసిం దని పవన్ చెప్పారు. స‌రే! ఏది ఏమైనా.. చింత‌మ‌నేని వ్య‌వ‌హారంపై ఇంత ఘాటుగా ప‌వ‌న్ వ్యాఖ్యానించ‌డం స‌ర్వ‌త్రా విస్మ‌యానికి గురి చేస్తోంది. సొంత జిల్లా నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన చింత‌మ‌నేనిపై కేవ‌లం మాట‌ల‌తోనే స‌రిపెట్ట‌డం ప‌వ‌న్ స్థాయికి స‌రిపోద‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. 


గ‌తంలో వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ కొన్ని వ్యాఖ్య‌లు చేసినప్పుడు ఏదైనా ఉంటే క‌లిసి కూర్చుని మాట్లాడుకుని ప‌రిష్క‌రించుకుంటే మేల‌ని అన్న ప‌వ‌న్ ఇప్పుడు చింత‌మ‌నేనిని రౌడీ అన‌డం ఎంత వ‌రకు క‌రెక్ట‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. నిజ‌మే చింత‌మ‌నేని వ్య‌వ‌హార‌శైలే అంత అయిన‌ప్ప‌డు ఆయ‌న‌తో మాట్లాడి వ్య‌వ‌హారాన్ని ప‌రిష్క‌రించుకుని ఉంటే ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త ఇమేజ్ పెరిగి ఉండేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇలా హెచ్చ‌రిక‌లు చేయ‌డం, వీటిని చింత‌మ‌నేని లైట్‌గా తీసుకోవ‌డం వంటివి కామ‌నేన‌ని ఫ‌లితం లేద‌ని అంటున్నారు. మ‌రి ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: