అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్యను  టీడీపీ నేతలు రాజకీయంగా వాడేసుకుంటున్నారు. మావోయిస్టుల చేతుల్లో ఎమ్మెల్యే  కిడారి చనిపోతే వైసీపీ హస్తం ఉందంటున్నారు. కిడారి కుటుంబాన్ని ఈ రోజు పాడేరులో పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వైసీపీనే పరోక్షంగా విమర్శించారు. మొత్తానికి మావోలను వదిలేసి రాజకీయం వైపు మాటల తూటాలు పేలడం ఏంటో అర్ధం కావడంలేదు.


అంతా వైఎస్సే చేశారు :


విశాఖ ఏజెన్సీలో బాక్సిట్ అనుమతులు వైఎస్సార్ ఇచ్చారని చంద్రబాబు  అంటున్నారు. పాడేరు లో ఈ రోజు కిడారి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం తాము ఎప్పటికీ బాక్సైట్ కి వ్యతిరేకమేనని చెప్పుకున్నారు. అలా స్పష్టమైన ప్రకటన కూడా చేశామని గుర్తు చేశారు. తమపై బురద జల్లడమేంటని మండిపడ్డారు. బాక్సైట్ గనులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా ఈ ఘటన జరగడం బాధాకరం. వైఎస్ హయాంలో కేటాయించిన గనులను మా ప్రభుత్వం రద్దు చేయించింది. ఈ విషయం తెలియని కొందరు అనసవర విమర్శలు చేస్తున్నారు అంటూ వైసీపీపై నేరుగా బాణాలు వేశారు.
అయితే ఇక్కడ బాబు గారు  గుర్తించినా కావాలని మరచిపోయిన అంశమొకటుంది. అది ఫిరాయింపుల  కధ. మావోలు బాక్సైట్ విషయమే కాదు, పార్టీ ఫిరాయించినదీ ప్రశ్నించారు. అది కూడా వైఎస్సారే చేయించరా అన్నది బాబు గారే చెప్పాలి.


మానవత్వం లేదా :


మరో వైపు విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ ఈ రోజు కూడా జగన్ ని టార్గెట్ చేశారు. జగన్ కి మానవత్వం లేదని, ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కక్ష కట్టారని విరుచుకుపడ్డారు. మనిషి చనిపోతే కనీసం పరామర్శకు కూడా రాని ప్రతిపక్ష నేత జగన్ ఒక్కరేనని నిందలు వేశారు. మొత్తానికి కిడారి హత్య కాదు కానీ టీడీపీ వైసీపీ మీద కాదేదీ విమర్శలకు అతీతం అన్నట్లుగా రెచ్చిపోతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: