ప్రతి రోజు ఉదయించే సూర్యుడిలా సాయంత్రానికి వచ్చే చంద్రుడిలా సత్యానికి కాలదోషం లేదు. అలాగే మహాత్ముడి జీవితకధ కూడా ఎప్పుడూ పాత పడదు. ప్రపంచ స్థాయి గ్లోబల్ సీయివోల సర్వేలో ప్రపంచం లోని అత్యుత్తమ నాయకులలో ఒక గొప్ప వ్యక్తిగా ఇప్పటికీ మహాత్ముడికి ప్రపంచ ప్రజలు ఓటు వేస్తున్నారు అంటే ఇది నమ్మలేని నిజం. చైనా లాంటి కమ్యునిస్ట్ దేశంలో గాంధీజీ పుస్తకాలకు, గాంధీజీ సూక్తులకు రోజురోజుకూ విలువ పెరుగుతోంది అంటే మన మహాత్ముడి స్థాయి ఏమిటో తెలుస్తోంది. మహాత్ముడి గాంధేయ సిద్ధాంతాలను ఇతివృతంగా తీసుకొని ‘సత్యాగ్రహ’, ‘లగరహో మున్నాభాయ్’ లాంటి సినిమాలు బాలీవుడ్ లో విడుదల అయి సంచలన విజయాలు సాధించాయి. 


మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే సాధారణ వ్యక్తి సత్యమే మార్గంగా, సత్యమే ఆయుధంగా, సత్యమే వ్రతంగా ఆ తదుపరి మహాత్ముడిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వ్యక్తిగా మారిన గాంధీ. తను రాసి ఆత్మకధ ‘మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్’ పుస్తకం మన భారతదేసంలోని అన్ని భాషలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో అనువాదం చెయ్యబడిన పుస్తకం అంటే చాలామంది నమ్మరు. మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఈ పుస్తకాన్ని ప్రపంచం లోని అనేక బిజినెస్ మేనేజ్ మెంట్ స్కూల్స్ పరిశోధన గ్రంధంగా గుర్తిస్తున్నారు, అంటే మహాత్ముడి ఆలోచనల విలువ ఎంతటిదో మన అందరికీ అర్ధం అవుతుంది. భారతదేశంలోని పుస్తకాల మార్కెట్ లో ఎన్నో రకరకాలా పుస్తకాలు వస్తున్నా, ఇప్పటికీ బెస్ట్ సెల్లర్స్ జాబితాలో మహాత్ముడి ఆత్మకధ ఉంది అంటే ఆ మహానుభావుడి జీవిత కధకు ఎంత విలువ ఉందో అర్ధం అవుతుంది.


 ‘గాంధీజీ బోధనలే నాకు స్పూర్తి. ఆయన లేకపోతే నేను అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచం ముందు నిలబడి ఉండేవాణ్ణి కాదు’ అన్న మాటలు ఈరోజు అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచాన్ని సాసిస్తున్న బరాక్ ఒబామా అన్న మాటలు. ఎటువంటి ఆకర్షణీయమైన రూపురేఖలు లేకుండా కొల్లాయి కట్టుకొని చేత కర్రతో కాలినడకన నడుస్తూ అతి సామాన్యమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి, రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించడమే కాకుండా అనేక భాషలతో, అనేక మతాలతో, ఇంకా అనేక సంస్కృతులతో అప్పటికే ముక్కలు ముక్కలు అయిపోయిన భారతదేశాన్ని ఒకతాటి పై తీసుకువచ్చి, స్వతంత్ర ఉద్యమ సారధిగా కోటానుకోట్ల భారతీయుల అభిమానాన్ని పొంది, భారతాజన హృదయాలలో జాతి పిత గా వెలుగొందిన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. ఈ పుణ్య భారతావని లో పుట్టి ఇప్పటికీ 144 సంవత్సరాలు గడచిపోయాయి.


గాంధీ జయంతి నాడు మాత్రమే గుర్తుకు తెచ్చుకొనే గాంధీ పేరును ఆయన బొమ్మ కరెన్సీ నోట్లపై లేకుండా ఉండి ఉంటే ఈపాటికే మన 120 కోట్ల మంది భారతీయులు మన పూజ్య బాపూజీ ని మరచిపోయి ఉండేవారేమో. తుపాకి గుండు తగిలినప్పుడు కూడా అమ్మ అనకుండా ‘హే రామ్’ అంటూ ప్రాణాలు వదిలిన ఆధ్యాత్మిక తత్వ వేత్త మహాత్మా గాంధీ. అందుకే బాపూజీ చూపించిన అహింసా మార్గం తనకే కాదు ప్రపంచానికి ఆదర్శ ప్రాయం అంటారు. బౌద్ధుల ఆధ్యాతిమిక గురువు దలైలామా. ఎన్నో జయంతులు వస్తున్నట్లుగానే చర్విత చరణంగా మరో గాంధీ జయంతిని రాజ్ ఘాట్ సాక్షిగా మన భారతజాతి మరోసారి నేడు జరుపుకుంటోంది. ఒక్క మాటలో ఆయన జీవితం గురించి చెప్పాలి అంటే విలువలకు నిలువెత్తు అద్దం మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జీవితం. 

మరింత సమాచారం తెలుసుకోండి: