మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి, మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డిల వ్య‌వ‌హారం క‌డ‌ప నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రికీ తెలిసిందే. ఒక‌రంటే ఒక‌రికి గిట్ట‌దు. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌దు. ఇలాంటి నాయ‌కులు .. అక‌స్మాత్తుగా ఒకే కౌగ‌లిలో బందీకావ‌డం.. అంటే మాట‌లు కాదు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఒకే పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ.. ఎలాంటి స‌ఖ్య‌త లేకుండానే వారు ముందుకు పోతున్నారు. అయితే, మ‌రో ఏడెనిమిది మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో వీరిద్ద‌రిమ‌ధ్య స‌ఖ్య‌త అవ‌స‌ర‌మ‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. దీంతో ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త చేకూర్చ‌డం ద్వారా అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించ‌గ‌ల‌న‌ని చంద్ర‌బాబు భావిసస్తున్నారు. 


ఈ క్ర‌మంలోనే  కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయ వ్యవహారాలు పార్టీలో  చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి వైసీపీ తరపున ఈ నియోజకవర్గంలో గెలిచారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని ఆయ‌న ఓడించాడు.  తర్వాత అనూహ్యంగా టీడీపీలోకి వచ్చారు. ఆయన చేరిక కూడా అంత సులభంగా జరగలేదు. రామసుబ్బారెడ్డి వర్గం ఆయన చేరికను గట్టిగా వ్యతిరేకించింది. రెండు వైపులా ఎన్నో దాడులు జరిగిన నేపథ్యంలో ఆయన్ను తీసుకోవడం తమకు సమ్మతం కాదని రామసుబ్బారెడ్డి వాదించారు. పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా కలుగజేసుకుని రామసుబ్బారెడ్డికి నచ్చజెప్పి ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు. 


తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆదినారాయణరెడ్డి ఏకంగా మంత్రి అయ్యారు. దీంతో రామసుబ్బారెడ్డి మరింత మనస్తాపానికి గురయ్యారు. ఈ ప‌రిణామాల‌ను చ‌ల్లార్చేందుకు చంద్ర‌బాబు.. రామ‌సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌విని, విప్‌ను క‌ట్ట‌బెట్టారు.  ఆ పదవి మంత్రి పదవితో సమాన స్థాయి ఉన్నది కావడంతో ఇరు వర్గాల మధ్య కొంత సర్దుబాటు జరిగింది. ఇక‌, అస‌లు స‌మ‌స్య ఇక్క‌డే స్టార్ట‌యింది. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరిలో టికెట్‌ ఎవరికి ఇవ్వాలన్న ప్రశ్న కొంతకాలంగా పార్టీ అధినాయకత్వాన్ని తొలుస్తోంది. చివరి దాకా పొడిగించకుండా కొంత ముందుగానే దీనిని పరిష్కరించడానికి నాయకత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా కొందరు సీనియర్‌ నేతలు.. ఇరువురితో విడివిడిగా కొన్ని దఫాలు సంప్రదింపులు జరిపారు. 


అధిష్ఠానం అనుకుంటున్న రాజీ ఫార్ములా ప్రకారం ఈ ఇద్దరిలో ఒకరు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా.. మరొకరు కడప ఎంపీగా పోటీ చేయాల్సి ఉంటుంది. దేనికి ఎవరన్నది ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఇద్దరు నేతలూ స్థూలంగా ఈ ఫార్ములాకు అంగీకరించారు. ఇందులో ఒకవేళ ఎవరైనా నష్టపోతే ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలన్నది కూడా చర్చిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు ఒక అంగీకారానికి వచ్చి పోటీ చేస్తే జమ్మలమడుగు నియోజకవర్గంలో పోటీ ఏకపక్షంగా ఉంటుందని, లోక్‌సభ అభ్యర్థికి ఈ ఒక్క సీటులోనే 50 వేల ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కడప లోక్‌సభ స్థానం పరిధిలోని పులివెందుల నియోజకవర్గం గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 70 వేల వరకూ మెజారిటీ వచ్చింది. పులివెందులకు కృష్ణా జలాల సరఫరా తర్వాత అక్కడ వైసీపీ ప్రాబల్యం తగ్గి.. టీడీపీకి ఆదరణ పెరిగిందని.. దీనివల్ల ఈసారి అక్కడ ఆ పార్టీ మెజారిటీని బాగా తగ్గించగలమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మ‌రి ఈ ఫార్ములాకు ఈ ఏనేత‌లు ఏమేర‌కు అంగీక‌రిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: