రాబోయే ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యంతోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి, తెలంగాణా ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కెసిఆర్ కుమ్మ‌కైన‌ట్లు రేవంత్ రెడ్డి ఫుల్లుగా ఫైర‌య్యారు. టిపిసిసి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, త‌న‌ను వేధించేందుకు, ముంద‌స్తు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోస‌మే కెసిఆర్ ప్రధాన‌మంత్రితో ఒప్పందం చేసుకున్న‌ట్లు ఆరోపించారు.  ఎన్నిక‌ల్లో త‌న‌ను ఎదుర్కునే ధైర్యం లేకే మోడి,కెసిఆర్ క‌లిసి కుట్ర చేసి త‌న‌ను ఇబ్బందులు పెట్టిన‌ట్లు మండిప‌డ్డారు. 


రేవంత్ రెడ్డి చెప్పిన ప్ర‌కారం అక్ర‌మాస్తులు, షెల్ కంపెనీలు, మ‌నీ ల్యాండ‌రింగ్ విష‌యంలో జ‌రుగుతున్న ప్ర‌చారమంతా అబ‌ద్దాలేనంటూ కొట్టేశారు.  23 ఏళ్ళ క్రితం తాను అద్దెకు ఇచ్చిన ఇంట్లో ఉన్న వారు వ్యాపారాలు చేసుకుంటే త‌న‌కు ఆపాదిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఐటి, ఈడి ఉన్న‌తాధికారుల‌పై ఒత్తిడి తెచ్చి త‌న‌ను వేధింపుల‌కు గురిచేయాల‌ని ఆదేశాలిచ్చి మ‌రీ సోదాలు జ‌రిపించిన‌ట్లు రేవంత్ ఆరోపించారు. 


ఎన్నిక‌ల్లో రాష్ట్ర‌మంతా తిరిగి కెసిఆర్ దోపిడిని, వేల కోట్ల దోపిడి గురించి ప్ర‌తీ గ్రామానికి వెళ్లి వివ‌రిస్తాన‌న్నారు. రామేశ్వ‌ర‌రావు, కెసిఆర్ వదిలిన బాణ‌మే లాయ‌ర్ రామారావుగా వివ‌రించారు. తెలంగాణా ఉద్య‌మం ముసుగులో కెసిఆర్ ఎంత సంపాదించింది, సినిమా వాళ్ళ‌తో చేస్తున్న చీక‌టి వ్యాపారాలు అన్నింటినీ వివ‌రిస్తాన‌న్నారు. టిఆర్ఎస్ ఏర్పాటు చేయ‌క‌ముందు కెసిఆర్ ఆస్తి ఎంత ? 2007 లో త‌న ఆస్తి ఎంత అనే విష‌యంలో సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ‌కు సిద్ద‌మా అంటూ స‌వాలు విసిరారు.

కెసిఆర్ తో పాటు కొడుకు కెటిఆర్, కూతురు క‌విత‌, అల్లుడ ఆస్తులు, అప్పుల‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ‌కు సిద్ద‌ప‌డాలని చాలెంజ్  చేశారు. విచార‌ణ‌కు హై కోర్టు జ‌డ్జి అయినా స‌రే, సుప్రింకోర్టు జ‌డ్జి తో అయినా స‌రే అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడికి లేఖ రాయాల‌న్నారు. అందుకు 24 గంట‌ల స‌మ‌యం  కూడా ఇచ్చారు.  నిటారుగా నిల‌బ‌డ‌డానికైనా, నికార్సుగా ఉండ‌టానికైనా, నిప్పుల్లో న‌డ‌వ‌టానికైనా తాను శీల‌ప‌రీక్ష‌కు సిద్ద‌మంటూ రేవంత్ చేసిన చాలెంజ్ చేయ‌టం గ‌మ‌నార్హం. ఆఫ్రికా దేశంలోని ఈడీ అమీన్ లాగ కెసిఆర్, కెసిఆర్ కుటుంబం తెలంగాణా ప్ర‌జ‌ల‌ను కిక్కు కోసం కాల్చుకుని తినే రోజులు రాబోతున్న‌ట్లు రేవంత్ హెచ్చ‌రించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: