ఆమె ఎమ్మెల్యే కానీ, తనకు తానుగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఏం చేసినా ముందుగా చెప్పాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా గుట్టు విప్పాల్సిందే. ఓ విధంగా స్వేచ్చ బాగా తగ్గిపోయింది. ఆమెకు భద్రత పేరిట పూర్తిగా తమ కంట్రోల్ లోకి తీసేసుకోవడంతో ఇపుడు ఆమె ఆ వలయంలో బంధీ అయిపోయారు.


చెప్పాల్సిందే :


విశాఖ మన్యంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన నేపధ్యంలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై పోలీసు ఆంక్షలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గిడ్డి అడుగు తీసి అడుగు వేసిన తమకు చెప్పాల్సిందేనని పోలీసులు గట్టి ఆంక్షలే పెట్టారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పాడేరు అసెంబ్లీ పరిధిలో మావోయిస్ట్లుల ప్రాబల్యం బాగా ఉండడంతో పోలీసుకు కఠిన నిర్ణయం తీసుకున్నారు.


నోటీసులు ఇచ్చేశారు :


తమ అనుమతి లేకుండా గ్రామాల్లో పర్యటించరాదని పేర్కొంటూ  జారీ చేసిన నోటీసులను పాడేరు ఎమ్మెల్యేకు పోలీసులు అందచేయడమే కాదు ఆమె నుంచి సంతకం కూడా తీసుకున్నారు. ఇక ఆమె ఎక్కడికి వెళ్ళినా పాడేరు ఏఏస్పీ అనుమతి తీసుకునే పర్యటించాలి. వద్దు అంటే మానుకోవాలి. ఓ విధంగా ఎమ్మెల్యే కాళ్ళకు సంకెళ్ళు పడిపోయాయనే చెప్పాలి. 


బులెట్ ప్రూఫ్ రెడీ :


ఇక ఎమ్మెల్యే ఈశ్వరికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ప్రభుత్వం సమకూర్చనుంది. దాంతో ఎమ్మెల్యేపై పూర్తి పోలీస్ నీడ ఉంటుంది. ఆమె ఇదివరకులా జనంలోకి వెళ్ళలేరు. వాళ్ళ సమస్యలు వినలేరు. ఎన్నికల వేళ నిజంగా ప్రజా ప్రతినిధులకు ఇది ఇబ్బందికరమైన పరిస్తితే. గిడ్డి విషయంలో పోలీసులు అతి చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ ఆంక్షలు  ఇపుడు గిడ్డి కి శాపంగా మారినట్లుగా ఉందంటున్నారు. చూస్తూంటే ఎమ్మెల్యే పదవి కంటే సామాన్యంగా ఉంటేనే బెటర్ అన్నట్లుగా పోలీసుల భద్రత తయరైందన్న సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: