అవును! ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్య‌లే వినిపిస్తున్నాయి. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ సొంత గ‌డ్డ కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ పుట్టిన ఊరుకు కూత‌వేటు దూరంలోనే ఉన్న కృష్ణా జిల్లాలోని అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌లో టీడీపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ఎన్టీఆర్ ప్రాథినిత్యం వ‌హించిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం పార్టీ దీన‌స్థితిని చూసి పార్టీ శ్రేణులే జాలి ప‌డాల్సిన ప‌రిస్థితి. పార్టీల‌కు అతీతంగా త‌న‌కంటూ సొంత ఇమేజ్ సాధించిన కొడాలి శ్రీవేంక‌టేశ్వ‌ర‌రావు ఉర‌ఫ్ కొడాలి నానికి తిరుగు లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ టీడీపీ నాయ‌కులు సొంత ప్ర‌యోజ‌నాల‌తో మునిగి తేలుతుండడం, ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వంటి కీల‌క అంశాలు ఆపార్టీకి శ‌రాఘాతంగా ప‌రిణ‌మించాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న కొద్దీ ఇక్క‌డ నాయ‌కుల కోసం టీడీపీ వెతుకులాట ప్రారంభించ‌డం గ‌మ‌నార్హం. 


గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున కొడాలి నాని పోటీ చేశారు. ఈయ‌న‌పై టీడీపీ త‌ర‌ఫున రావి వెంక‌టేశ్వ‌ర రావు బ‌రిలో నిలిచారు. అయితే, హోరా హోరీగా సాగుతుంద‌ని భావించిన పోటీ కాస్తా సింగిల్ సైడ్ అయిపోయింది. దాదాపు 12 వేల ఓట్ల మెజారిటీతో నాని విజ‌య‌దుందుభి మోగించారు. వాస్త‌వానికి నాని టీడీపీలో ఉండ‌గా రెండు సార్లు వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోయారు. ఆయ‌న వైసీపీలోకి మారిన త‌ర్వాత కూడా వ‌రుస విజ‌యాల ప‌రంప‌ర‌ను కొన‌సాగించారు. దీంతో ఇక్క‌డ పార్టీల‌తో సంబంధం లేకుండానే నానికి ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతున్నారు. ఇప్ప‌టికే గ‌త ఎన్నిక‌ల్లో గెలుపు సాధించిన నాని మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. టికెట్ కూడా క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. 


అయితే, నానిని ఓడించాల‌ని, త‌న‌పై చేస్తున్న తీవ్ర విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌ని టీడీపీఅధినేత చంద్ర‌బాబు వ్యూహాత్మ కంగా ముందుకు వెళ్లాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఒక్క‌టి కూడా ఫ‌లించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన రావికి మ‌ళ్లీ టికెట్ ఇచ్చినా ఆయ‌న గెలిచే ప‌రిస్థితి లేద‌ని చంద్ర‌బాబు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. రావి గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ గుడివాడ‌లో నాని చేతిలో చిత్తుగా ఓడిపోతున్నారు. 2009లో ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి జంప్ చేసి మ‌రోసారి ఓడారు.


ఇక్క‌డ నానిని ఢీ కొట్టాలంటే రావిని కాకుండా ఆయ‌న స్థానంలో  గుడివాడ అర్బ‌న్ బ్యాంకు చైర్మ‌న్‌ పిన్న‌మ‌నేని పూర్ణ‌వీర‌య్య‌(బాబ్జీ)ను రంగంలోకి దింపాల‌న్నా.. ఆయ‌న‌కు కూడా అవకాశాలు త‌క్కువ‌గానే ఉన్నాయి. మ‌రోప‌క్క‌, మునిప‌ల్ చైర్మ‌న్ య‌ల‌వ‌ర్తి శ్రీనివాస‌రావుకు అవ‌కాశం ఇద్దామ‌న్నా సొంత‌గూటిలోనే అస‌మ్మ‌తి సెగ‌లు కక్కుతున్నాయి. ఎవ‌రిని కాద‌ని ఎవ‌రికి టికెట్ ఇచ్చినా .. మిగిలిన ఇద్ద‌రూ వారి ఓట‌మికి ప్ర‌య‌త్నించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక ఇక్క‌డ నాని దూకుడుకు చెక్ పెట్టేందుకు టీడీపీ విజ‌య‌వాడ‌కు చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌ను ఇక్క‌డ ప్రోటోకాల్ ఇన్‌చార్జ్‌గా నియ‌మించినా ఆయ‌న కూడా నాని దూకుడుకు ఏ మాత్రం బ్రేక్ వేయ‌లేక‌పోయారు. దీనికితోడు వైసీపీ సంస్థాగ‌తంగా మంచి ప‌ట్టు సాధించింది. దీంతో ఇక్క‌డ కొడాలి నానిదే తిరుగులేని విజ‌య‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: