తెలుగుదేశంపార్టీలో రాజీనామాలు కలకలం సృష్టిస్తోంది. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వర్గపోరు తారాస్ధాయికి చేరుకోవటంతో విభేదాలు రోడ్డున పడుతున్నాయ్. మాజీ ఎంఎల్ఏ వరదరాజుల రెడ్డికి వ్యతిరేకంగా మరో మాజీ ఎంఎల్ఏ లింగారెడ్డి వర్గం మండిపడుతోంది.  ఆ రెండు వర్గాలకు మధ్య గొడవలు తీవ్ర స్ధాయిలో నడుస్తోంది. అందుకనే పై రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటోంది.

 

ఎలాగూ షెడ్యూల్ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కోసం రెండు వర్గాల నేతల  మధ్య ఆధిపత్యం గొడవలు పెరిగిపోయాయి. అందులో భాగంగానే ఈరోజు మున్సిపాలిటీలోని లింగారెడ్డి వర్గానికి చెందిన  కౌన్సిలర్లు రాజీనామాలు చేశారు. వరదరాజులరెడ్డి ఆధిపత్యానికి నిరసనగా లింగారెడ్డి వర్గానికి చెందిన 21 మంది కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఛైర్మన్ ను అడ్డుపెట్టుకుని వరతరాజులరెడ్డి అందరినీ ఇబ్బందులు పెడుతున్నట్లు కౌన్సిలర్లందరూ మండిపడుతున్నారు.

 

వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కోసం ఒకవైపు వరదరాజుల రెడ్డి మరోవైపు లింగారెడ్డి తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఎవరి  దారిలో వాళ్ళు చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తెస్తున్నారు. నిజానికి లింగారెడ్డి మొదటి నుండి టిడిపిలోనే ఉన్నారు. వరదరాజుల రెడ్డే కాంగ్రెస్ లో నుండి టిడిపిలో చేరారు. పోయిన ఎన్నికల్లో వరదరాజుల రెడ్డి  కోసమే లింగారెడ్డికి  చంద్రబాబు టిక్కెట్టు ఇవ్వలేదు. అయితే వరదరాజుల రెడ్డి ఓడిపోయారు. తన ఓటమికి లింగారెడ్డే కారణమన్న కోపంతో వరదరాజులరెడ్డి కత్తికట్టారు. అప్పటి నుండి ఇద్దరికీ పడటం లేదు. మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోడ్డున పడుతున్న గొడవలకు చంద్రబాబు ఏ విధంగా ముగింపు పలుకుతారో చూడాల్సిందే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: