ప్రధాన ప్రతిపక్షం వైసిపి నేతలపై అదికారపార్టీ ప్రజా ప్రతినిధుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి.  అభివృద్ధిపై టిడిపి ఎంఎల్ఏని చాలెంజ్ చేసిన ఘటనలో వైసిపి సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చెయ్యిని పోలీసులు విరగొట్టారు ఈ రోజు. దాంతో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో ఉద్రిక్తత పెరిగిపోయింది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, శింగనమలలో అభివృద్ధి జరిగిందని ఎంఎల్ఏ యామినీబాల చెబుతుండగా అవినీతి తప్ప అభివృద్ధే లేదని వైసిపి నేత జొన్నలగడ్డ పద్మావతి ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి చివరకు సవాళ్ళ వరకూ వెళ్లింది వ్యవహారం. దాంతో నియోజకవర్గంలోని నార్పల గ్రామాన్ని ఈరోజు చర్చకు వేదికగా నిర్ణయించుకున్నారు.  అనుకున్నట్లే  గ్రామానికి పద్మావతి  చేరుకున్నారు. యధావిధిగా ఎంఎల్ఏ యామిని రాలేదు.

 

ఎంఎల్ఏ అయితే రాలేదు కానీ పోలీసులు మాత్రం వచ్చేశారు. ఎంతసేపటికీ ఎంఎల్ఏ రాకపోయేసరికి వైసిపి శ్రేణులు నిరసన మొదలుపెట్టారు. దాంతో పోలీసులకే మండిపోయింది. ఇంకేముంది తెరవెనుక నుండి వచ్చిన ఆదేశాలమేరకు వెంటనే రంగంలోకి దిగేశారు. జొన్నలగడ్డపై దౌర్జన్యం చేసి ఆమెను ఈడ్చుకుంటూ జీపులోకి నెట్టేశారు. వెంటనే జీపు బయలుదేరింది. అయితే ఓ స్పీడ్ బ్రేకర్ దగ్గర జీపు డోర్ ఊడిపోవటంతో పక్కనే కూర్చున్న పోలీసు బయటకు పడబోయారు. దాంతో తన పక్కనే కూర్చున్న జొన్నలగడ్డ చెయ్యిని ఊతంగా పట్టుకున్నారు. ఆ బలానికి జొన్నలగడ్డ చెయ్యి విరిగిపోయింది.


తన చెయ్యి నొప్పిగా ఉందని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లమని జొన్నలగడ్డ ఎంత అడిగినా పోలీసులు పట్టించుకోలేదు. అయితే దాదాపు 2 గంటల తర్వాత గొడవ చేస్తే అపుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు. పద్మావతిని  పరీక్షించిన డాక్టర్లు చెయ్యి ఫ్రక్చర్ అయ్యిందని చెప్పి కట్టుకట్టారు. విషయం తెలియగానే వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన మొదలుపెట్టటంతో పరిస్దితి ఉద్రిక్తంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: