ఇపుడందరిలోను ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. నిజామాబాద్ ప్రజాదీవెన సభలో టిఆర్ఎస్ చీఫ్, తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసియార్ మాట్లాడిన మాటలు, చేసిన కామెంట్లపైనే ఇపుడందరూ చర్చించుకుంటున్నారు. దాదాపు గంటన్నరసేపు సాగిన కెసియార్ ప్రసంగంలో ఒకవైపు కాంగ్రెస్ ను ఇంకోవైపు చంద్రబాబునాయుడును ఉతికారేశారు. ఏ ఒక్క నేతను పేరు పెట్టి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో చంద్రబాబును మాత్రం పేరు పెట్టి చాలా ఘాటుగా మాట్లాడారు. నిజానికి చంద్రబాబుపై ఎవరూ ఈ స్ధాయిలో విరుచుకుపడలేదు. ఒకవిధంగా చెప్పాలంటే చంద్రబాబుపై కెసియార్ వ్యాఖ్యలు చాలా అసహ్యంగా ఉన్నాయి.  కనీసం సాటి ముఖ్యమంత్రన్న గౌరవం కూడా ఇవ్వలేదు.  

 చంద్రబాబును తెలంగాణా ద్రోహిగా కెసియార్ చిత్రీకరించారు. వేలాదిమంది చావుకు కారణమంటూ మండిపడ్డారు. తెలంగాణా ఉద్యమానికి వ్యతిరేకంగా చంద్రబాబు పనిచేశారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణా ఉద్యమానికి చంద్రబాబు అడ్డంపడ్డట్లు కెసియార్ మండిపడ్డారు. చంద్రబాబును ఏపి రాక్షసిగా వర్ణించారు. తెలంగాణా ఉద్యమానికి వ్యతిరేకంగా కేంద్రానికి 30 లేఖలు రాశారట. తెలంగాణా ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు ప్రయత్నించి ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అంటూ విరుచుకుపడ్డారు.

సరే, ఈ విషయాలను పక్కనపెడితే కెసియార్ చేసిన వ్యాఖ్యలకు, కామెంట్లకు చంద్రబాబు ధీటైన జవాబు చెప్పగలరా అన్నదే ప్రశ్న.  ప్రతీ సందర్భంలో చంద్రబాబును పేరుపెట్టి మరీ కెసియార్ విరుచుకుపడుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం కెసియార్ పేరెత్తటానికే భయపడుతున్నారు. ఓటుకునోటు కేసులో అడ్డంగా బుక్కైపోయి హైదరాబాద్ నుండి అర్ధాంతరంగా విజయవాడకు పారిపోయిన దగ్గర నుండి కెసియార్ పేరెత్తాలంటేనే భయపడిపోతున్నారు.

ముందస్తు ఎన్నికల నేపధ్యంలో ఓటుకునోటు విచారణ వేగం పుంజుకోవటంతో చంద్రబాబులో మళ్ళీ టెన్షన్ మొదలైంది. అందుకే తెలంగాణా గురించి మాట్లాడాలన్నా, కెసియార్ గురించి చెప్పాలన్నా పరోక్షంగా అదీ అర్ధం కాకుండా మాట్లాడుతున్నారే కానీ నేరుగా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారంటేనే కెసియార్ అంటేనే చంద్రబాబు ఎంతలా భయపడిపోతున్నారో తెలిసిపోతోంది. ఏం చేస్తాం చేసుకున్న వారికి చేసుకున్నంత అన్న సామెత ఊరికే వచ్చిందా ?

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: