తెలంగాణలో ఈ నెల రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంద‌న్న వార్తలతో ఇక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ తొలి సీఎంగా రికార్డులకు ఎక్కిన కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మళ్ళీ తానే సీఎం అవ్వాలన్న ప్రయత్నాల్లో దూసుకుపోతున్నారు. ఈ సారి కేసీఆర్‌ను ఎలాగైన గద్దె దించాలన్న వ్యూహంతో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనమితి పార్టీలు కలిపి మహాకూటమిగా ఏర్పడుతున్నాయి. నిన్నటి వరకు టీఆర్‌ఎస్‌కు వార్‌ వన్‌ సైడ్‌గా ఉంటుందని భావించిన వారందరూ మహాకూటమి ఏర్పాటుతో తెలంగాణలో ఈ సారి హోరాహోరీ పోరు తప్పదని అంచనా వేస్తున్నారు. 

Image result for telangana

ఇక గత ఎన్నికల తర్వాత కేసీఆర్‌ చేపట్టిన ఆపరేషన్ ఆక‌ర్ష్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌, టీడీపీ, బీఎస్‌పీ, సీపీఐ, వైసీపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దీంతో ఇప్పుడు ఈ ఓవర్‌ లోడే టీఆర్‌ఎస్‌ బండిని కదలనీయ‌కుండా చేసే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే కేసీఆర్‌ ఒకే విడతలో 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతోనే అధికార టీఆర్‌ఎస్‌లో అస‌మ్మ‌తి భ‌గ్గుమంది. ఎన్నికల టైమ్‌ దగ్గర పడుతున్న కొద్దీ ఇది మరింతగా రాజుకునే పరిస్థితి ఉందే తప్పా తగ్గడం లేదు. టిక్కెట్లు ఆశించి భంగపడిన ఆశావాహులు... తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి కష్టపడిన వారంతా ఇప్పుడు తీవ్ర స్థాయిలో భ‌గ్గుమంటున్నారు. 


ఈ క్రమంలోనే పలువురు నాయకులు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌లో చేరిపోయారు. అస‌మ్మ‌తుల‌కు కేసీఆర్ వార్నింగ్‌లు ఇస్తున్నా ఎవ్వ‌రూ ఆయ‌న మాట ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో చివ‌ర‌కు కేసీఆర్ అస‌మ్మ‌తి వాదుల‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో మూడు, నాలుగు నియోజకవర్గాల్లో బలమైన ప్రభావం చూపే కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్‌లో చేరిపోగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా అదే రూట్లో వెళ్లారు. ఇక కొద్ది రోజులుగా సస్‌పెన్స్‌తో నడుస్తూ వస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు సీనియర్‌ నేత డీఎస్‌ ఎపిసోడ్‌ సైతం త్వరలోనే మూగియ‌నుందని తెలుస్తోంది. డీఎస్‌ కూడా త్వరలోనే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ఇక ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా ఖ‌నాపూర్‌ టిక్కెట్‌ ఆశించిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్‌ కాంగ్రెస్‌లో చేరిపోయారు. 


ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చి ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పలువురు కీలక నేతలు కూడా కాంగ్రెస్‌లోకి ఇతరపార్టీల్లోకి జంప్‌ చేసేందుకు రెడీగా ఉండడంతో టీఆర్‌ఎస్‌కు మరింత టెన్షన్‌ పట్టుకుంది. ఇక మాజీ ఎమ్మెల్యే న‌ల్గొండ జిల్లాకు చెందిన బాలు నాయక్‌ సైతం అదే రూట్లో ఉన్నారు. ఎన్నిక‌ల టైం ద‌గ్గ‌ర ప‌డేకొద్ది టీఆర్ఎస్‌కు మ‌రిన్ని షాకులు త‌ప్పేలా లేవు. ఇదే అస‌మ్మ‌తి జ్వాల‌లు  కంటిన్యూ అయితే కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడి సీఎం కుర్చీ నుంచి దిగినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా.



మరింత సమాచారం తెలుసుకోండి: