అటు వాళ్లు ఇటు.. ఇటు వాళ్లు అటు! ఎన్నిక‌ల స‌మయంలో క‌నిపించే పెద్ద చిత్రాల్లో ఇదే ప్ర‌ధాన ఘ‌ట్టం! టికెట్‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న నేత‌లు.. త‌మ‌కు టికెట్ ద‌క్క‌ద‌ని తెలిశాక వెంట‌నే వేరే పార్టీలోకి జంప్ అయిపోతారు. ప్రస్తుతం ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ బ‌లం నానాటికీ పుంజుకుంటోంది. ముఖ్యంగా అభివృద్ధి మంత్ర‌మే జ‌పిస్తూ.. వైసీపీని వీలైనంత‌గా దెబ్బ‌కొట్టాల‌ని భావిస్తున్న టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుకు షాకులు త‌గులుతున్నాయి. ఇన్నాళ్లూ వైసీపీ నుంచి ఎమ్మెల్యేల‌ను లాక్కున్న బాబుకు.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఝ‌లక్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే.. టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయ‌న వైసీపీలో చేరిక దాదాపు ఖ‌రారు అయిపోంది. నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ టికెట్ ద‌క్కే అవ‌కాశాలు లేక‌పోవ‌డం.. అధిష్ఠానం వేరొక‌రిని ప్రోత్స‌హిస్తుండ‌టాన్ని జీర్ణించుకోలేక‌పోయిన ఆయ‌న‌.. జ‌గ‌న్ చెంత‌కు చేరిపోబోతున్నారు. ఫ‌లితంగా నియోజక‌వ‌ర్గంలో టీడీపీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో.. టీడీపీ నేత‌ల్లో ఆందోళ‌న మ‌రింత పెరుగుతోంది!


టీడీపీలో కొన్ని నియోజక‌వ‌ర్గాల్లో నేత‌ల మ‌ధ్య‌ అంత‌ర్గ పోరు తీవ్ర‌మ‌వుతోంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో.. ఇప్పుడిప్పుడే ఇవి తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇన్నాళ్లూ వీటిని అదుపులోనే ఉంచినా.. ఇక ప‌రిస్థితి చెయ్యి దాటిపోతోంది. ఫలితంగా నేత‌లు ఒక్కొక్క‌రుగా త‌లోదారి వెతుక్కుంటున్నారు. త‌మ‌కు టికెట్ ద‌క్కుతుందని హామీ ల‌భించ‌గానే వేరే పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని శుక్ర‌వారం లోటస్‌ పాండ్‌లో కలవబోతు న్నారు. కొన్నాళ్లుగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఆయ‌న‌.. చివ‌ర‌కు పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోతులకు, ఆమంచికి రాజీ చేయటంలో చంద్రబాబు విఫలమయ్యారనే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. 


నియోజకవర్గంలో ఆమె అన్ని వ్యవహరాల్లో కలుగజేసుకుని ఇబ్బందులకు గురిచేస్తుండ‌టంపై చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్‌కు పలుమార్లు విన్నవించినా వారు స్పందించటం లేదని ఆమంచి ఆరోపిస్తున్నారు. పైగా ఆమెకే వారిద్ద‌రూ మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని ఆమంచి వాపోతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పార్టీ మారిపోతార‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఇటీవల ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా కలిసినట్లు తెలుస్తోంది. పవన్‌ సామాజిక వర్గానికి చెందిన ఆమంచి జనసేనలో చేరటం లాంఛనమేనని జనసేన కార్యకర్తలు భావించారు. ఆయన అనూహ్యంగా జ‌గన్‌ను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 ఎన్నికలలో నవోదయం పార్టీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై సంచలన విజయం సాధించారు. అనంత‌రం టీడీపీలో చేరి కీలకంగా వ్యవహరించారు. 


గత ఎన్నికల్లో తనపై ఓడిపోయిన సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందే కాకుండా నియోజకవర్గంలో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వటం ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నారు. నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి తానేన‌ని సునీత చెపుతుండటం మింగుడు పడటం లేదు. దీంతో ఆయన టిడిపిని వీడాలని నిర్ణయం తీసుకున్నారని స‌న్నిహితులు చెబుతున్నారు. లోటస్‌పాండ్‌లో ఆయన జగన్‌ను కలుస్తారని.. తర్వాత పార్టీలో చేరతారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ప‌రిణామాల‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. గట్టి షాక్ త‌గ‌లడం ఖాయ‌మంటున్నారు విశ్లేష‌కులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: