రోహింగ్యా ముస్లింలు దేశంలోకి అక్రమంగా వచ్చిన వలసదారులని, వారు దేశ భద్రతకు ముప్పు అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారిలో కొందరు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్), లష్కరే వంటి ఉగ్రవాద సంస్థలు పన్నుతున్న కుట్రల్లో భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నది.  అటువంటివారు దేశంలో నివసించడం జాతీయ భద్రతకు పెను ప్రమాదమని తెలిపింది. భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలపై కేంద్ర ఉక్కుపాదం మోపుతోంది.  సుప్రీంకోర్టు అనుమతితో ఇప్పటికే ఏడుగురు రోహింగ్యాలకు తిరిగి మయన్మార్‌కు పంపారు. అసోంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని వెనక్కి పంపించారు. అటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలపైనా సీరియస్‌గా దృష్టిసారించారు.  

rohingya

ఐక్యరాజ్యసమితి 1951 శరణార్థుల తీర్మానంపై భారత్ సంతకం చేయనందున రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలన్న నిబంధనలు తమకు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులకు ఆర్మీ ఇంటెలిజెన్స్ లేఖ రాసింది. హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాల పేర్లు, ప్రస్తుత చిరునామా, మయన్మార్ చిరునామా వివరాలు సేకరించాలని స్పష్టం చేసింది. మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాలు హైదరాబాద్‌ శివార్లలో నివసిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్, బాలపూర్ ప్రాంతాల్లో సుమారు 3,600 మంది రోహింగ్యాలు ఉంటున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం ఇంకా ఎక్కువ మందే జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.  


నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు సృష్టించి అక్రమంగా నివసిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు కేరళ, జమ్మూకాశ్మీర్, ఈశాన్యరాష్ట్రాల్లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు వెనక్కి పంపించేందుకు రంగం సిద్ధం చేసింది కేంద్రం. ఏది ఏమైనా అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలతో వాటికి ముప్పు వాటిల్లే అవకాశముందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వారిపై కేంద్రం సీరియస్‌గా దృష్టిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: