టీఆర్ఎస్‌లో మంత్రి హ‌రీశ్‌రావ్ ఎంత‌టి బ‌ల‌వంతుడో సీఎం కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌కు అర్థ‌మైందా?  బావ‌తో జ‌గ‌డం కంటే స్నేహ‌మే మంచిద‌నే అభిప్రాయానికి ఆయ‌న వ‌చ్చారా?  ఎన్నిక‌ల స‌మ‌యంలో హ‌రీశ్‌ను దూరం చేసుకుంటే.. భ‌విష్య‌త్‌లో జ‌ర‌గ‌బోయే ప‌రిణామాలు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు బావ‌మ‌రిదికి బోధప‌డ్డాయా?  వీట‌న్నింటి ప‌ర్య‌వ‌సాన‌మే కేటీఆర్ ఇటీవ‌ల చేస్తున్న వ్యాఖ్య‌లా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. `హ‌రీశ్, నేనూ అన్న‌ద‌మ్ముల్లా పెరిగాం! మా ఇద్దరి మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇద్ద‌రం ఒకే కేబినెట్‌లో ప‌నిచేయ‌డం అదృష్టం` అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు టీఆర్ఎస్‌లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ఒక‌ప‌క్క హ‌రీశ్‌రావును కేసీఆర్ దూరం పెడుతున్నార‌ని, ఆయ‌న వ‌ర్గానికి అన్యాయం జ‌రిగిందంటూ ప్ర‌తిప‌క్షాలు ప్ర‌చారం చేస్తున్నాయి. ఇటీవ‌ల టీఆర్ఎస్‌లో ప‌రిణామాలు కూడా ప్ర‌తిప‌క్షాల మాట‌లే నిజ‌మేమో అనిపించేలా సంకేతాలు కూడా క‌నిపించాయి. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. హ‌రీశ్‌కు ఉన్న ఇమేజ్ గుర్తించే.. కేటీఆర్ ఇలా ప్లేటు ఫిరాయించి ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తేస్తున్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

Image result for telangana

టీఆర్ఎస్‌లో రెండు ప‌వ‌ర్ కేంద్రాల మ‌ధ్య ఆధిప‌త్య పోరుకు బ్రేక్ ప‌డింది. ఇది తాత్కాలికమా లేక శాశ్వ‌తంగానా అనే విష‌యం ప‌క్క‌న పెడితే.. ఇరువురు నేత‌లు ఒక‌రినొక‌రు ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించుకుంటున్నారు. నువ్వు తోపు అని ఒక‌రంటే.. నువ్వు సూప‌ర్ అని ఇంకొక‌రు అంటున్నారు. త‌మ మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని అటు ప్ర‌జ‌ల‌కు.. ఇటు ప్ర‌తిప‌క్షాల‌కు చెప్పేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. సీన్ క‌ట్ చేస్తే.. కొంత కాలం నుంచి హ‌రీశ్‌రావు, కేటీఆర్ మ‌ధ్య గ్యాప్ ఎక్కువ‌వుతోంద‌నే చ‌ర్చ టీఆర్ఎస్‌లోనే మొద‌లైంది. హ‌రీశ్‌ను సైడ్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని పార్టీ నేత‌లే అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అంతేగాక అభ్య‌ర్థుల కేటాయింపులోనూ ఆయ‌న వ‌ర్గానికి తీవ్ర నిరాశే ద‌క్కింద‌ని తేలిపోయింది. ఈ నేప‌థ్యంలో హ‌రీశ్ వ‌ర్గంలోని కొంద‌రు నేత‌లు.. పార్టీ మారిపోవ‌డానికి కూడా సిద్ధ‌మైపోయారు. ఇది పార్టీకి తీవ్ర ఇబ్బందులు తీసుకొస్తుంద‌ని భావించిన కేసీఆర్.. వెంట‌నే రంగంలోకి దిగారా అనేంత‌గా ప‌రిణామాలు మారుతున్నాయి. 


తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్గాల్లో ఈ అంశంపై ప్రస్తుతం హాట్ హాట్ చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితం హరీశ్‌రావు తన నియోజకవర్గానికి చెందిన పనుల కోసం సీఎం కేసీఆర్ తో సమావేశమ‌య్యారు. ఆయన కేటీఆర్ తో మాట్లాడుకోమని హరీశ్‌కు సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. అప్పటివరకూ ఏ పని అయినా కేసీఆర్ తో ఓకే చేయించుకోవటమే హరీశ్‌కు అలవాటు. అనూహ్యంగా తాను అడిగిన పనిపై కేటీఆర్ తో మాట్లాడుకోమని సూచించటంతో హరీశ్‌ నొచ్చుకుని.. అటు నుంచే అటు వెళ్ళిపోయారు. అక్కడ నుంచే కేసీఆర్, హరీశ్‌ మధ్య గ్యాప్ బాగా పెరిగిందని చెబుతున్నారు. తర్వాత పలు అంశాల్లో హరీశ్‌ను దూరం పెట్టారు. టీఆర్ఎస్ సొంత మీడియాలో హరీశ్‌కు ఏ మాత్రం ప్రాముఖ్యత లేకుండా చేశారు. కానీ ఈ మధ్యే గజ్వేల్ కు చెందిన కొంత మంది నేతలు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి..కాంగ్రెస్ లో చేరారు. ఇది టీఆర్ఎస్ వర్గాలను షాక్ కు గురి చేసింది.


హరీశ్‌తో సంబంధం లేకుండా పార్టీని వీడిన వారిని వెనక్కి తెఛ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో హరీశ్‌ను రంగంలోకి దింపారు. దీంతో కాంగ్రెస్ లోకి వెళ్ళిన వాళ్ళు వెంటనే తిరిగి టీఆర్ఎస్ లోకి చేరిపోయారు. హరీశ్‌ను దూరం పెడితే  జరిగే నష్టం గ్రహించే కేటీఆర్ స్వయంగా హరీశ్‌తో మాట్లాడినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చాలా సమావేశాలకు దూరం పెడుతున్న హరీశ్‌ రావును ఇటీవల అనూహ్యంగా సిరిసిల్ల నియోజకవర్గ సమావేశానికి ఆహ్వానించారు. ఆ సమావేశంలోనే హరీశ్‌పై కేటీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. హరీశ్‌ కూడా కేటీఆర్ ను పొడిగిన విషయం తెలిసిందే. కేవలం తమ అవసరాలకే ప్రస్తుతానికి హరీశ్‌ రావును దగ్గరకు తీసుకున్నారని.. లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే టెన్షన్‌లో కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని పార్టీ నేత‌లు చెబుతున్నారు. టీఆర్ఎస్ లో  ప్రస్తుతానికి ఈ ఆధిపత్య పోరుకు ఇలా బ్రేక్ వేశార‌ని చెబుతున్నారు. మ‌రి భ‌విష్య‌త్‌లో ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో వేచిచూడాల్సిందే!



మరింత సమాచారం తెలుసుకోండి: