చంద్రబాబునాయుడుకు ఆ నియోజకవర్గం పెద్ద తలనొప్పిగా తయారైంది. సొంతజిల్లా చిత్తూరులో ఇప్పటి వరకూ ఏ నియోజకవర్గం కూడా చంద్రబాబుకు అంత సమస్యగా తయారు కాలేదు. ఆ సమస్య పరిష్కరించేందుకే ఈరోజు నిగిరి నియోజకవర్గంలోని నేతలతో  సమావేశం పెట్టారు.  జిల్లాలో మొదటి నుండి పుత్తూరు, నగిరి నియోజకవర్గాలంటే టిడిపిలో వినబడే పేరు గాలి ముద్దు కృష్ణమనాయుడే. దశాబ్దాల పాటు పుత్తూరు నుండే ప్రాతినిధ్యం వహించినా నియోజకవర్గం కనుమరుగైన తర్వాత నగిరి నుండి పోటీ చేశారు. అయితే నగిరిలో ఎప్పుడూ గెలవలేదనుకోండి అది వేరే సంగతి.

 

క్రియాశీల రాజకీయాల్లో ఉండేందుకు వీలుగా సీనియర్ అయిన గాలిని చంద్రబాబు ఎంఎల్సీని చేశారు. అయితే  అనారోగ్యంతో ఎంఎల్సీ పదవికాలం పూర్తి కాకుండానే హఠాత్తుగా గాలి మరణించారు.  దాంతో మిగిలిన పదవి కాలం కోసం వారసత్వం విషయంలో సమస్యలు మొదలయ్యాయి. ఇద్దరు కొడుకులు జగదీష్, భానుప్రకాశ్ ఎవరికి వారుగా తమకే ఎంఎల్సీ పదవి కావాలంటూ పట్టుపట్టారు. ఎవరు వెనక్కు తగ్గకపోవటంతో చివరకు చంద్రబాబు గాలి భార్య సరస్వతిని ఎంఎల్సీని చేశారు.

 

అప్పటికేదో సమస్యను పరిష్కరించటం బాగానే ఉంది. కానీ వచ్చే ఎన్నకల్లో టిక్కెట్టు సంగతేంటి ? కొడుకిలిద్దరూ మళ్ళీ పోటీ పడుతున్నారు. అంటే సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఆరోగ్యంగా ఉన్న రోజుల్లోనే  గాలి కూడా వారసత్వంపై నిర్ణయించలేదు. దాంతో ఇపుడు ఇద్దరు కొడుకులు రచ్చ చేసుకుంటూ రోడ్డున పడ్డారు.  ఆ విషయాన్ని తేల్చేందుకు ఈరోజు సమావేశం పెట్టారు. వీరిద్దరితో పాటు మరో సీనియర్ నేత అశోక్ రాజు కూడా టిక్కెట్టు కోసం పోటీ పడుతున్నారు. అశోక్ కు టిక్కెట్టిస్తే గాలి కుటంబం నుండి నియోజకవర్గం చేజారిపోయినట్లే. కాబట్టి వారు ఎంత వరకూ సహకరిస్తారో అనుమానమే. మరి టిక్కెట్టు విషయంలో చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: