విజయనగరం అంటే పూసపాటి రాజుల గురించే చెప్పుకోవాలి.సంస్థాధీశులుగా వారికి  వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ప్రజస్వామ్య యుగంలోనూ వారిని జనం సమాదరించి గెలిపిస్తూ వచ్చారు. అయితే ఎపుడూ రోజులు ఒకేలా ఉండవు. మారుతూ ఉంటాయి. రాజులను తరాజులను చేసే మాయోపాయాలు పార్టీలు పన్నుతూ ఉంటాయి.  ఆ వ్యూహాల్లో చిక్కి రాజులు పరాజితులైన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా పూసపాటి వారి వారసులు ఆనందగజపతి, అశోక్ గజపతి కూడా ఓటమి పాలు అయ్యారు.


మళ్ళీ అక్కడేనట :


విషయానికి వస్తే కేంద్ర  మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మరో మారు విజయనగరం లోక్ సభ సీటు నుంచి పోటీ చేస్తారని టాక్. ఆయన అసెంబ్లీకి సుముఖంగా ఉన్నా పట్టు పట్టి చంద్రబాబు పార్లమెంట్ కే పంపుతారని అంటున్నారు. గత సారి మంచి మెజారిటీతో గెలిచిన అశోక్ బీజేపీతో పొత్తులో భాగంగా కేంద్ర మంత్రి గా కూడా పనిచేశారు. ఈసారి కాంగ్రెస్ తొ పొత్తు కలసి వస్తుందని నమ్ముతున్నారు.  ఇక్కడ మళ్ళీ గెలిస్తే    కేంద్ర మంత్రి పదవి ఖాయమని నమ్ముతున్నారు.


డీ కొట్టేది ఆయనే :


ఇక అశోక్ గజపతి రాజుని ఓడించాలని వైసీపీ అధినేత జగన్ పట్టుదల మీద ఉన్నారు. ఆయనకు సమ ఉజ్జీని కూడా ఎంపిక చేసేశారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపాలని జగన్ దాదాపుగా డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. దీనిపై బొత్స తర్జన భర్జన పడుతున్నారు. ఆయన మనసు చీపురుపల్లి అసెంబ్లీపై ఉంది. అయితే జగన్ మాత్రం రాజు గారిని ఓడించాలంటే బొత్స వల్లనే సాధ్యమని గట్టిగా భావిస్తున్నారుట.


భీకర పోరు :


అదే జరిగితే ఈ ఇద్దరు నేతల మధ్యన భీకరమైన పోటీ ఉంటుందనడంలో సందేహం లేదు. జిల్లా రాజకీయాలో నాలుగు దశాబ్దాలుగా ఇద్దరూ ఉన్నా ఏనాడూ ముఖాముఖీ తలపడలేదు. మరి అటు చంద్రబాబు, ఇటు జగన్ వత్తిడి మీద ఇద్దరు డీ కొంటే మాత్రం అది ఏపీ రాజకీయాల్లోనే సెన్సేషన్ అవుతుంది. ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా పోటీ ఉంటుంది. విజేత ఎవరన్నది కూడా ఉత్కంఠగా మారుతుంది.  మొత్తానికి ఈ ఇద్దరూ కనుక పోటీ రసవత్తరంగా మారడమే కాదు, ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ఘాటెక్కించే మాస్ మసాలా మూవీగానూ ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: