గుంటూరు జిల్లాలో రాబోయే ఎన్నికల్లో వైసిపి అధ్యక్షుడు జగన్ పలువురికి షాక్ ఇవ్వనున్నారా ? జిల్లా పార్టీలో ఇపుడీ విషయంపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి.  ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో  కొందరికి జగన్ ఝులక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తొందరలో షాక్ తినబోయే వారిలో జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న సిట్టింగ్ ఎంఎల్ఏలుల కూడా ఉన్నారన్న ప్రచారమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అటువంటి సిట్టింగుల్లో మంగళగిరి నియోజకవర్గం ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుండటమే గమనార్హం.

 

జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో పోయిన ఎన్నికల్లో క్రిస్తినా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటునే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు తనకే అన్న ధీమాతో నియోజకవర్గంలో బాగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్ధితుల్లో  హైదరాబాద్ లో బేస్ చేసుకున్న డాక్టర్ శ్రీదేవి పేరు తాజాగా తెరపైకి రావటంతో పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. శ్రీదేవి పేరు ప్రచారంలోకి వచ్చిన దగ్గర నుండి క్రిస్తినాలో అభద్రత మొదలైంది.

 

ఇక, మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ విషయం వేరేగా ఉంది. ఆళ్ళ గురించి, జగన్ తో ఆళ్ళకున్న సన్నిహితం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రాజదాని ప్రాంతంలోని వైసిపి ఎంఎల్ఏగా చంద్రబాబునాయుడును ఆళ్ళ ఓ రేంజిలో ఆటాడుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. కోర్టులో కేసులతో చంద్రబాబును ఆళ్ళ గుక్కతిప్పుకోనీయటం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆళ్ళ ఓటమిపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారంటేనే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు. అటువంటిది ఆళ్ళకు కూడా మంగళగిరిలో టిక్కెట్టు డౌటే అనే ప్రచారం టిడిపి మీడియాలో మొదలైంది. నియోజకవర్గంలోని అసమ్మతిని సర్దుబాటు చేసుకోకపోతే టిక్కెట్టు గ్యారెంటీ లేదని జగన్ చెప్పినట్లు టిడిపి మీడియా ప్రచారం చేస్తోంది.

 

ఇక పెదకూరపాడులో పోటీ చేసిన మనోహర్ నాయుడు స్ధానంలో కొత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారి  శంకర్ రావు పేరు తెరపైకి వినిపిస్తోంది.  మరి మనోహర్ పరిస్ధితేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. అదే విధంగా వేమూరు నియోజకవర్గంలో సమన్వయకర్త మేరుగ నాగార్జునకు కూడా టిక్కెట్టు కష్టమే అనే ప్రచారం జరుగుతోంది. పోయిన ఎన్నికల్లో ఓడిపోయినా మేరుగ మాత్రం నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని తిరుగుతున్నారు. అటువంటిది చివరకు మేరుగకే టిక్కెట్టు గ్యారెంటీ లేదనే ప్రచారం జరుగుతుండటం ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికలు సమీపించేకొద్దీ జగన్ ఇంకెన్ని సంచలనాలు చేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: