మరో ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరిపై మావోయిస్టులు గురిపెట్టారు. 2 నెలల తర్వాత కిడారి సర్వేశ్వరరావుకు పట్టిన గతే పడుతుందని ఓ లేఖలో స్పష్టంగా గడువు విధించటంతో ఇపుడు గిడ్డిలో టెన్షన్ మొదలైంది. వైసిపి తరపున విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గంలో గెలిచిన గిడ్డి ఈశ్వరి రూ 20 కోట్లు తీసుకుని తెలుగుదేశంలోకి వెళ్ళిన విషయం తమకు తెలుసన్నారు. పోయిన నెల 23వ తేదీన అరకు ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.

 కిడారిని మావోయిస్టులు కాల్చి చంపేముందు దాదాపు గంటసేపు స్ధానిక గిరిజనుల మధ్యే ప్రజాకోర్టు పేరుతో విచారించారు.  ఆ సమయంలో పార్టీ ఫిరాయింపుకు రూ 12 కోట్లు తీసుకున్నట్లు అంగీకరించారని సమాచారం. అదే సమయంలో గిడ్డి ఫిరాయింపు విషయం కూడా మాట్లాడినట్లు సమాచారం. కిడారి చెప్పారని మావోయిస్టులు లేఖలో చెబుతున్న ప్రకారమే టిడిపిలోకి వెళ్ళేందుకు గిడ్డి మంత్రి పదవి హామీతో పాటు రూ 20 కోట్లు తీసుకున్నారట. ఆ విషయాన్ని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు.

రెండు నెలల్లో గిడ్డి తీసుకున్న రూ 20 కోట్లను స్దానిక గిరిజనులకు పంచాలని ఆదేశించారు. బాక్సైట్ గనుల తవ్వకాలను వ్యతిరేకించాలని చెప్పారు. ఇవన్నీ 2 నెలల్లోపల చేయకపోతే గిడ్డిని కూడా కిడారిని కాల్చి చంపేసినట్లే చంపుతామంటూ హెచ్చరించటంతో ఫిరాయింపు ఎంఎల్ఏల్లో టెన్షన్ పెంచేస్తోంది. మొన్న కిడారి హత్య జరిగిన దగ్గర నుండి గిడ్డిలో కూడా ప్రాణభయం మొదలైందన్నది వాస్తవం. మావోయిస్టులు ప్రధానంగా బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. కిడారైనా, గిడ్డైనా వైసిపిలో ఉన్నంత కాలం బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళే. ఎప్పుడైతే టిడిపిలోకి ఫిరాయించారో తర్వాత వాళ్ళ స్టాండ్ మారిపోయింది. దాని వల్లే కిడారి మావోయిస్టుల తుపాకులకు గురయ్యాడు. మరి మావోయిస్టుల తాజా హెచ్చరికలతో గిడ్డి ఏం చేస్తుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: