ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను ఎడా పెడా మారుస్తూ.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మ‌రో త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డ‌నుందా? అది కూడా అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావ‌రిలోనే కానుందా?  వ‌చ్చేఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్న వ‌ర్గానికి ఇక్క‌డ అన్యాయం జ‌రుగుతోందా?  నేత‌ల మ‌ధ్య టికెట్ చిచ్చు రాజుకుంటోందా? అంటే తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. రానున్న ఎన్నికలకు సంబంధించి తూర్పుగోదావ‌రి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థిపై వైసీపీ క‌సర‌త్తు ప్రారంభించింది. ఈ క్ర‌మంలో ఆపార్టీ ప్రధాన కార్యదర్శి, ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు బూత్‌స్థాయి కమిటీ సభ్యులు కన్వీనర్లతో సమావేశమయ్యారు. 


నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు విశేషంగా కృషి చేస్తున్నారని ఆయన నేతృత్వంలో ప్రత్తిపాడు ఎన్నికలకు సన్నద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. ప్ర‌ధానంగా నవరత్నాల పథకాలు విస్తృతంగా తీసుకెళ్ళడంతో పాటు సీఎం చంద్రబాబు రాష్ట్రానికి చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అయితే, వైవీ నిర్వ‌హించిన ఈ స‌మావేశానికి ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, బీవీఆర్‌ చౌదరి, కుమార్‌ రాజా, అలమండ చలమయ్య స్థానిక నాయకులు రాయవరపు భాస్కరరావు, కొండపల్లి అప్పారావు, బీఎస్‌వీప్రసాద్‌, కొల్లు చిన్నా వంటి వారు పాల్గొన్నారు.  అయితే,  ప్రత్తిపాడు వైసీపీ టికెట్‌ ఆశిస్తున్న మురళీకృష్ణంరాజు, ఆయన వర్గం నేతలు హాజరుకాకపోవడం సమావేశంలో చర్చనీయాంశమైంది. 


నాలుగు మండలాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరైనా, మురళీకృష్ణంరాజు వర్గానికి చెందిన వ్యక్తులు కేవలం 10మంది మాత్రమే వచ్చారని అదికూడా ఇక్కడ జరిగే విషయాలను ఆయనకు చేరవేసేందుకేనని అంటున్నారు. ఇక‌, పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు హాజరుకాకపోవడం కూడా మ‌రింత వివాదంగా మారింది. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో ఆశావ‌హుల‌పై నీళ్లు జ‌ల్లుతూ.. ఇబ్బంది పాల‌వుతున్న వైసీపీకి ఇప్పుడు ఇది మ‌రో త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించ‌క త‌ప్ప‌ద‌నే వ్యాఖ్య‌లుజోరుగా వినిపిస్తున్నాయి. కుర‌సాల క‌న్న‌బాబుకు గ‌ట్టి ప‌ట్టు ఉండ‌డం, ఆయ‌న వైవీ స‌మావేశానికి గైర్హాజ‌ర‌వ‌డం వంటి ప‌రిణామాలు ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తాయ‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ వీటిని ఎలా స‌ర్దు బాటు చేస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: