విశాఖపట్నం మాజీ మేయర్, అనకాపల్లి మాజీ ఎంపి సబ్బం హరి ఆస్తుల స్వాధీనానికి విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు నోటీసు ఇవ్వటం సంచలనంగా మారింది. బ్యాంకుకు రూ 9.54 కోట్ల బకాయిలను చెల్లించకపోవటంతోనే బ్యాంకు సబ్బంకు నోటీసులు ఇచ్చింది. తమ బ్యాంకులో అప్పు తీసుకుని ఎంతకీ చెల్లించని కారణంగానే తాము నోటీసులు ఇచ్చామని బ్యాంకు ఛైర్మన్ చెబుతున్నారు. ఒకవేళ తమ అప్పు తీర్చకపోతే సబ్బం ఆస్తులను స్వాధీనం చేసుకుని తమ బకాయిలు రాబట్టుకుంటామని బ్యాంకు పాలకమండలి ఛైర్మన్ మానం ఆంజనేయులు స్పష్టం చేస్తున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, నగరం మధ్యలో మద్దిలపాలెంలో ప్రముఖ మీడియా డెక్కన్ క్రానికల్ భవనం ఉంది. ఆ భవనాన్ని కోటక్ మహీంద్ర వేలం వేసింది 2014లో. చాలామంది లాగ భవనాన్ని కొనుగోలు నిమిత్తం సబ్బం కూడా వేలంపాటలో పాల్గొన్నారు. మొత్తానికి రూ 17.80 కోట్లతో వేలంపాటలో అందరికన్నా ఎక్కువగా పాడుకున్నారు. దాంతో  అంత మొత్తం చెల్లించి భవనాన్ని దక్కించుకోవాలని కోటక్ మహీంద్ర సబ్బకు చెప్పింది. పెద్ద మొత్తంలో డబ్బు కావాల్సొచ్చి విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకులో సబ్బం దాదాపు రూ  10 కోట్లు రుణం తీసుకున్నారు.

 

అయితే, డబ్బులు కట్టే సమయంలో నిబంధనల ప్రకారం తమ భవనాన్ని వేలం వేయలేదని డెక్కన్ క్రానికల్ యాజమాన్యం డెబిట్ రికవరీ అప్పిలేట్ అథారిటికి ఫిర్యాదు చేయటంతో వేలం పాట రద్దైంది. అందులో భాగంగానే సబ్బం కట్టిన డిపాజిట్ డబ్బు ను వెనక్కిచ్చేయాలని కూడా అథారిటీ కోటక్ ను ఆదేశించింది. మరి తెరవెనుక ఏం జరిగిందో ఏమోగానీ ఎక్కడ వ్యవహారాలు అక్కడే నిలిచిపోయాయి. అంటే కోటక్ మహీంద్రా నుండి డిపాజిట్ డబ్బు సబ్బంకు చేరింది లేంది తెలీదు. కానీ విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు నుండి మాత్రం సబ్బం అప్పు తీసేసుకున్నారు. అంటే ఒకరి డబ్బు మరొకరి దగ్గరుండిపోయాయన్నమాట. దాంతో తమ డబ్బుల రికవరీ కోసం ఒకరి వెనకాల మరొకరు తిరుగుతున్నారు. అందులో భాగంగానే తమ అప్పు తీర్చకపోతే సీతమ్మధారలోని 1622 చదరపు అడుగుల్లోని ఇల్లు, మధవాపురంలోని ఉడా లేఅవుట్ లోని 444 చదరపు అడుగుల విస్తార్ణంలోని అపార్టు మెంటు, రుషికొండ దగ్గర్లోని 800 చదరపు అడుగుల ఇంటి స్ధలం వేలం వేసేసి తమ డబ్బు రాబట్టుకుంటామని నోటిసిచ్చింది.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: