ఆ మద్య ఆంధ్రప్రదేశ్ లో హుధూద్ తుఫాన్ ఎంత బీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆస్తి, ప్రాణ నష్టంతో వైజాగ్ కకావిలకం అయ్యింది.  తాజాగా ఒడిశా, ఉత్తరాంధ్రను వణికిస్తున్న 'తిత్లీ' తుపాను పెను విలయం సృష్టిస్తూ తీరం దాటింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, కవిటి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, పలాస, గార, సోంపేట తదితర ప్రాంతాల్లో తుపాను ప్రజా జీవనాన్ని భీతావహం చేసింది.  ఇప్పుడు తుపాను ఉత్తరాంధ్రను వణికిస్తోంది. తిత్లీ అతి తీవ్ర తుపానుగా మారి తీరాన్ని తాకింది.


ఇది మరింత బలపడి పెను తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ చెబుతోంది.  తుపాను తీరం దాటుతున్న వేళ, గంటకు 150 కిలోమీటర్ల వరకూ గాలులు వీచాయి. వజ్రపుకొత్తూరు మండలంలోని గొల్లపాడు - పల్లెసారధి మధ్య తిత్లీ తీరాన్ని తాకింది. గాలుల తాకిడికి జిల్లాలో పలుచోట్ల విద్యుత్ సరఫరా కుప్పకూలింది. తూర్పు కోస్తా రైల్వే రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, నందిగాం, పలాస, వజ్రపు కొత్తూరు, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. సోంపేటలో గత రాత్రి నుంచి వర్షం కుండపోతగా కురుస్తోంది.


తీరం దాటిన తరువాత బలహీనపడే క్రమంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఉదయం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఆర్టీజీఎస్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సీఎం మాట్లాడారు.  ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి జిల్లా వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు.


తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో.. పలుచోట్ల కాల్ సెంటర్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎస్సెమ్మెస్‌ల ద్వారా వరద హెచ్చరిక సందేశాలు పంపిస్తోంది. సహాయం కోసం 1100 నంబరుకు కాల్ చేయాలని అధికారులు కోరారు. విజయనగరంలోని కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. 08922 236947, టోల్ ఫ్రీ నంబరు 1077కు ఫోన్ చేసి సాయం కోరవచ్చు. విశాఖ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటరు నంబరు 1800 4250 0002.

మరింత సమాచారం తెలుసుకోండి: