టిఆర్ఎస్ చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసియార్ కు హై కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. ముందస్తు ఎన్నికల బిజీలో ఉన్న కెసియార్ కు కోర్టు ఆదేశాలు మింగుడుపడనిదనే చెప్పాలి. మొన్నటి ఆగస్టులో పదవీకాలమై పోయిన సర్పంచి పదవులకు కెసియార్ ఎన్నికలు నిర్వహించలేదు. వెంటనే ఎన్నికలు నిర్వహిస్తే ఎక్కడ సమస్యలు వస్తాయో అన్న భయంతోనే కెసియార్ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించలేదన్నది బహిరంగ రహస్యం.

 

అప్పటికే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్న కెసియార్ సర్పంచ్ ఎన్నికలను వ్యూహాత్మకంగా వాయిదా వేశారు. మళ్ళీ ఎన్నికలు జరిగే వరకూ పంచాయితీల్లో స్పెషల్ ఆఫీసర్లను ఇన్చార్జిలుగా నియమించారు. షెడ్యూల్ ప్రకారమే పంచాయితీ ఎన్నికలు జరిపితే జనాల్లో వ్యతిరేకత ఉంటే ఆ విషయం సర్పంచ్ ఎన్నికల్లో కనబడుతుంది. అదే ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రంగా కనబడుతుంది. పంచాయితీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు చెందిన నేతలు ఓడిపోతే తమ పాలన అద్భుతంగా ఉందని చెప్పుకునేందుకు కెసియార్ కు అవకాశం ఉండదు. అపుడు ప్రతిపక్షాలదే పై చేయవుతుంది.

 

అన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకునే కెసియార్  పంచాయితీ ఎన్నికలను వాయిదా వేశారు. కెసియార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుమారు 500మంది సర్పంచులు కోర్టులో కేసులు వేశారు. ఆ కేసులను విచారించిన హై కోర్టు ఈ రోజు కెసియార్ కు తలంటింది. పంచాయితీ ఎన్నికలను వాయిదా వేయటం రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. మూడు నెలల్లో పంచాయితి ఎన్నికలను నిర్వహించాల్సిందేనంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు నెలల్లో పంచాయితీ ఎన్నికలంటే కెసియార్ లక్ష్యం నెరవేరినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: